ప్రభుత్వ ఉద్యోగులందరికీ తగిన గుర్తింపు, గౌరవం దక్కేలా వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు తెలిపారు. పలు సమస్యల పరిష్కారం కోరుతూ 104 , 108 వాహనాల ఉద్యోగులు తాజాగా సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈ నెల 22 నుంచి సమ్మె నిర్వహించాలని ఉద్యోగులు నిర్ణయం తీసుకోవడంతో.. ఆయా ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రి విడదల రజిని గారితో చర్చలు జరిపారు.
గుంటూరు కొరిటెపాడు రోడ్డు చంద్రమౌళి నగర్‌లోని తన కార్యాలయంలో మంత్రి విడదల రజిని గారు ఉద్యోగులతో శనివారం ఈ చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని గారు మాట్లాడుతూ 108, 104 వాహనాల ఉద్యోగులను ఆప్కాస్ లో చేర్చాలనే వినతిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గారి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. 104, 108 ఉద్యోగులకు ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలని సంఘాల నాయకులు కోరగా.. వెంటనే ప్రతిపాదనలు తయారుచేస్తామని మంత్రి రజినీ హామీ ఇచ్చారు.
ఉద్యోగులు కోరుతున్నవాటిలో ప్రధానమైన శ్లాబ్ పద్ధతిని వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి నెలా ఉద్యోగులకు క్రమం తప్పకుండా జీతాలు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు 104, 108 ఉద్యోగుల జీతాలను సమయానికి అందించేవికావని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతి నెలా జీతాలు విడుదల చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇకపై కూడా ప్రతి నెలా మొదటి వారంలోని ఉద్యోగులందరికీ జీతాలు అందేలా కృషి చేస్తామన్నారు.