కెసిఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నాం – ఎంపీ లక్ష్మణ్

సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని అన్నారు బిజెపి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితులపై హైదరాబాద్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బిజెపిదే అధికారమని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు. అలాగే ఏపీలో తమకు జనసేన పార్టీతో తప్ప మరే ఇతర పార్టీతో పొత్తులేదని స్పష్టం చేశారు.

టిడిపి తో పొత్తు అనేది కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. దక్షిణాదిలో కర్ణాటక తరువాత తెలంగాణలోనే అధికారంలోకి వస్తామన్నారు. బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడుగా నియమించడమే కేంద్ర మంత్రి పదవిగా భావిస్తున్నట్లు తెలిపారు లక్ష్మణ్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తర్వాత పార్లమెంటరీ బోర్డు సభ్యుడుగా నియమితులైన రెండో వ్యక్తిని తానే అంటూ ఆనందం వ్యక్తం చేశారు.