బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తికి వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్ చేయడం వెనుకనున్న ఆంతర్యం ఏమిటని రఘురామకృష్ణ గారు రాజు ప్రశ్నించారు. బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరో రాజకీయ నాయకులలో ఒక్క పర్సెంట్ వ్యక్తులు చెప్పినా తన వేలు నరుక్కుంటానని ఆయన సవాల్ చేశారు. అటువంటి బ్రెజిల్ కు అధ్యక్షుడు ఎవరో ఒకరు ఎన్నికైతే, వారిని అభినందిస్తూ 2022 అక్టోబర్ 31వ తేదీన విజయసాయిరెడ్డి గారు చేసిన ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిందన్నారు.
అమెరికా అధ్యక్షుడు ఎవరంటే అందరూ చెప్పగలరని, ఎందుకంటే అమెరికాలో మన బంధువులు ఉంటారు కాబట్టి… బ్రెజిల్ లో ఎటువంటి యవ్వారాలు నడపకపోతే అక్కడ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి విజయసాయిరెడ్డి గారికి ఎలా తెలుస్తారంటూ రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి గారికి, జగన్ మోహన్ రెడ్డి గారికి బ్రెజిల్ దేశంతో వ్యాపార సంబంధ బాంధవ్యాలు లేకపోతే, ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి ఎందుకు శుభాకాంక్షలను చెబుతారని నిలదీశారు. భవిష్యత్తులో కంటైనర్ దొరికిపోతుందని బహుశా అంచనా వేసి ఉండరని అందుకే దూలతో ట్విట్ చేసి తప్పులో కాలు వేశారన్నారు.
ఇంటర్నేషనల్ డ్రగ్ డీల్ కేవలం సాధారణ వ్యక్తులతో సాధ్యం కాదని, ఇది కేవలం ప్రభుత్వ పెద్దలతోనే సాధ్యమవుతుందన్నారు. నైజీరియన్లు చిన్న మొత్తంలో డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తే వారిని అదుపులోకి తీసుకుంటారన్నారు. చిన్న మొత్తంలో డ్రగ్స్ విక్రయించడం కూడా నేరమేనన్న ఆయన, మలేషియా, సింగపూర్ దేశాలలో ఒక్క గ్రాము మాదకద్రవ్యం లభించిన ఉరిశిక్ష విధిస్తారన్నారు. నైజీరియన్ల వద్ద గ్రాముల్లో దొరికితేనే కఠినమైన శిక్షలు విధించినప్పుడు, టన్నుల్లో మాదకద్రవ్యాలను దిగుమతి చేసుకున్న వారికి ఏ శిక్ష విధించాలన్నారు.