తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల బర్డ్ ఫ్లూ కేసులు భారీగా వెలుగుచూశాయి. ఏపీలోని పలు జిల్లాల్లో కోళ్లు బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాధి బారిన పడ్డాయి. దీంతో కొంతకాలం పాటు చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ఇక ఇటీవల తెలంగాణలోని నల్గొండ జిల్లాలోనూ బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. అయితే ఏపీలో ఈ వైరస్ వ్యాప్తిపై తాజాగా ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ ఓ సంచలన నివేదిక విడుదల చేసింది.
ఏపీలోని 8 ప్రాంతాల్లో కోళ్ల ఫామ్స్, ఇంట్లో పెంచుకునే కోళ్లలో వ్యాధికారక H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ గుర్తించినట్లు భారతీయ అధికారులను ఉటంకిస్తూ డబ్ల్యూఏహెచ్ఓ ఓ రిపోర్టును విడుదల చేసింది. సాధారణంగా బర్డ్ ఫ్లూ అని పిలిచే ఏవియన్ ఇన్ ఫ్లూఎంజా వ్యాప్తిని ఇటీవల ఏపీలోని తూర్పు ప్రాంతంలో గుర్తించినట్లు పారిస్ కు చెందిన సంస్థ తన నివేదికలో తెలిపింది. దీని వల్ల ఏకంగా 6 లక్షల 2 వేల కోళ్లను చింపేసినట్లు వెల్లడించింది.