హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలో దేవాదుల ప్రాజెక్టు పైప్‌లైన్ తాజాగా లీక్ అయింది. పైప్ లైన్ లీక్ కావడంతో భారీ ఎత్తున నీరు ఎగిసిపడుతోంది. పాతాళగంగను తలపిస్తున్న ఈ దృశ్యాన్ని అటుగా వెళ్తున్న వారు తమ సెల్ ఫోన్ కెమెరాల్లో బంధించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే పెద్ద ఎత్తున నీరు ఎగిసిపడుతుండటంతో భారీగా నీరు వృథాగా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ సబ్ స్టేషన్లో పవర్ ట్రిప్ అవడంతో మోటర్ ఒక్కసారిగా ఆగిపోవడం వల్ల పైప్‌లైన్‌పై లోడ్ పడి అది డామేజ్ అయ్యిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం వల్లే పైప్‌లైన్ పగిలి నీరు వృథాగా పోతుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ పైప్‌లైన్ ధర్మసాగర్ పంపు హౌస్ నుంచి గండిరామారం రిజర్వాయర్‌కు వెళ్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలు దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులోని మూడో దశ పూర్తయితే వరంగల్ జిల్లా సస్యశ్యామలం అవుతుంది.