ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తరువాత జరిగే బీఏసీ సమావేశంలో ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈనెల 28న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. మరోవైపు రేపు అసెంబ్లీకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు వెల్లనున్నారు. అందుకోసం జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆదేశాలు జారీ చేశారు.
ముందుగా అసెంబ్లీ కమిటీ హాల్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నారు. శాసనసభ, మండలిలో వ్యవహరించాల్సిన తీరు పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. సూపర్ సిక్స్ హామీలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని టార్గెట్ తో వైసీపీ ఉన్నట్టు సమాచారం. మరోవైపు వైసీపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా డిమాండ్ చేయనుంది. ప్రజా సమస్యలపై చర్చకు ప్రజల తరపున ప్రశ్నించేందుకు ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయనుంది. ప్రతిపక్ష హోదా కోసం ఇప్పటికే హైకోర్టుకు కూడా వెళ్లింది వైసీపీ.