ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీసీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అకాల వర్షానికి నష్టపోయిన పంట పొలాలను సందర్శించారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. చంద్రబాబు సర్కార్ రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
రైతులను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. మూడేళ్లు ఓపిక పడితే వైఎస్సార్సీపీ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వస్తుందని తెలిపారు. మన ప్రభుత్వం రాగానే నెల రోజుల్లో రైతులకు ఇన్సూరెన్స్ ఇప్పిస్తానని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పంట నష్టపోయిన రైతులకు ఎంతో కొంత సాయం చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు.
ఇక గత వారం రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఈదురు గాలులతో కురిసిన వానతో వందలాది ఎకరాల్లో మొక్కజొన్న, అరటి తోటలు నేలకొరిగాయి. గరివిడి మండలంలో 300 ఎకరాలు, చీపురుపల్లి మండలంలో 450 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం చేకూరిందని వ్యవసాయశాఖ ప్రాథమిక పరిశీలనలో తేలింది.