ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తనయుడి వివాహం రాజస్థాన్ లోని జోద్పూర్ లో నిన్న సాయంత్రం ఘనంగా జరిగింది. ఆదివారం ఉదయం క్రైస్తవ సంప్రదాయంలో పెళ్లి జరగనుంది. పెళ్లికి ఏపీ సీఎం జగన్ హాజరు కాకపోవడం గమనార్హం. రాజకీయంగా జగన్ పై షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ రాలేదా లేక బిజీగా ఉండి వెళ్లలేదా అన్న ఆసక్తికర చర్చ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
ఇక ఆదివారం ఉదయం క్రైస్తవ సంప్రదాయంలో జరిగే పెళ్లికి అయినా జగన్ వస్తారో లేదో వేచి చూడాలి. ఇది ఇలా ఉండగా… కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమిలోకి రావాలని వైసీపీ భావిస్తే పరిశీలిస్తామని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. బీజేపీతో టీడీపీ-జనసేన కూటమి కలవడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో వైసీపీ కాంగ్రెస్ వైపు చూస్తుందా అన్న ఆసక్తి నెలకొంది. ఒకవేళ వైసీపీకి ఆ ఆలోచన ఉంటే తాము పరిశీలిస్తామని తులసి రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో పొత్తుకు టీడీపీ, జనసేన పాకులాడుతున్నాయని ఆయన మండిపడ్డారు.