బౌండరీలపై కుంబ్లే కమిటీ !

-

ఇటీవల వరల్డ్‌కప్ చూశారు కదా.. ఫైనల్ మ్యాచ్ అంతా ఆద్యంతం ఉత్కంఠం. చివరకు బౌండరీల ఆధారంగా విజేతలను ప్రకటించారు. దీనిపై సర్వత్రా విమర్శలు. అయితే దానిపై స్పందించిన ఐసీసీ బౌండరీల లెక్కించే నిబంధనపై సమీక్షించేందుకు భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. వివరాలు తెలుసుకుందాం….

Anil Kumble-led ICC cricket panel to discuss boundary count rule

ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో బౌండరీల లెక్కింపుతో ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించిన ఐసీసీపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. క్రికెట్ దిగ్గజాలు, ప్రస్తుత క్రికెటర్లు, విశ్లేషకులు సైతం దీనిపై పెదవివిరిచారు. సూపర్ ఓవర్‌లోని పరుగులు కూడా సమం అయితే బౌండరీల ఆధారంగా గెలుపును నిర్ణయించడం సరికాదని అన్నారు. దీనిపై ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని ఐసీసీకి సూచించారు. తీవ్రస్థాయిలో వస్తున్న విమర్శలపై ఐసీసీ ఎట్టకేలకు స్పందించింది. బౌండరీల లెక్కించే నిబంధనపై సమీక్షించేందుకు భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఐసీసీ నిర్వహించే తదుపరి సమావేశంలో ఈ నిబంధనపై చర్చించనున్నారు. సమావేశం వచ్చే ఏడాది త్రైమాసికంలో జరగుతుందని ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డెస్ తెలిపారు.

మ్యాచ్ టైగా ముగిస్తే సూపర్ ఓవర్‌తో విజేతను నిర్ణయించే పద్ధతిని 2009 నుంచి పాటిస్తున్నారు. సూపర్ ఓవర్‌లో కూడా పరుగులు సమం అయితే బౌండరీల లెక్కతో గెలుపును ప్రకటిస్తారు. ప్రపంచకప్ ఫైనల్లోనూ అదే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న టీ20లీగ్‌ల్లోనూ దాదాపుగా ఇదే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. అన్ని ప్రోఫెషనల్ క్రికెట్లలో ఒకే తరహాలో సూపర్ ఓవర్ నిబంధనలు ఉండాలి. దీనిపై ప్రత్యామ్నాయాలు ఉంటే అనిల్‌కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్ కమిటీ పరిశీలిస్తుంది. అని జియోఫ్ పేర్కొన్నారు. వార్షిక సమావేశంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రపంచకప్ ఫైనల్ గురించి చర్చించలేదని వెల్లడించారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news