వాహనదారులకు రవాణా శాఖ మరో అవకాశం కల్పించింది. పెండింగ్ ఛలాన్ ల చెల్లింపునకు గడువు తేదీ జనవరి 31 వరకు పొడిగిస్తూ.. బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. పోలీసుల రికార్డుల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్ లు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం డిసెంబర్ 25 వరకు ఉన్న వాటిపై భారీగా రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం ఇతర వాహనాలకు 60 శాతం రాయతీ ప్రకటించడంతో మంచి స్పందన లభించింది.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 1.05 కోట్ల ఛలాన్లు మాత్రమే చెల్లించారు. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.107 కోట్ల ఆదాయ లభించింది. సాంకేతిక సమస్యతో చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని వాహనదారుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ తరుణంలో రాయితీ గడువును పొడగిస్తూ.. నిర్ణయం తీసుకున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. చలాన్ చెల్లింపులో ఏమైనా సందేహాలుంటే 040-27852721, 8712661690 నెంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. మీ సేవ, పేటీఎం, టీ వ్యాలెట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు స్వీకరించనున్నట్టు వెల్లడించారు.