కర్ణాటకలో ఓ వింత వివాదం తెరపైకి వచ్చింది. అదే చెడ్డి వివాదం. విద్యను కాషాయీకరణ చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(NSUI) సభ్యులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ ఇంటి బయట కాకి నిక్కర్లను కాల్చి తమ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య స్పందించారు.” ఎన్ఎస్యూఐ సభ్యులు పోలీసుల ఎదుట చెడ్డీ లను కాల్చారు. కానీ ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా మేము ఎక్కడైనా కలుస్తాం” అని పేర్కొన్నారు.
మాజీ సీఎం వ్యాఖ్యలు కాస్త వివాదానికి దారితీశాయి. బీజేపీ నేత చలవాడి నారాయణస్వామి మాట్లాడుతూ.. ఆయన ఈ స్థాయికి దిగజారడం ఊహించలేదని పేర్కొన్నారు. “సిద్ధరామయ్య చెడ్డీలు కాల్చాలనుకుంటే ఆయన ఇంట్లో వాటిని కాల్చుకోనియ్యండి. సిద్దరామయ్య కు చెడ్డీలు పంపి సహాయం చేస్తామని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులకు తెలియజేశాను. చెడ్డీలను కాల్చడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది కాబట్టి కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి తీసుకోవాలని కోరుతున్నాను. సిద్ధరామయ్య ఈ స్థాయికి దిగజారి పోతారని అనుకోలేదు అన్నారు నారాయణస్వామి. కాగా సిద్ధరామయ్య వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయానికి పెద్ద ఎత్తున నిక్కర్ పార్సిల్లను పంపుతున్నారు.