గత టీడీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని పోలవరం, అమరావతి నిర్మాణాలని, అన్న క్యాంటీన్, ఇసుక పంపిణీలకు ప్రస్తుత జగన్ సర్కార్ బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. టీడీపీ అవినీతికి పాల్పడిందని వీటి మీద సమీక్షలు చేసి తగిన చర్యలు తీసుకుని పనులు మొదలపెట్టాలని చూస్తోంది. అయితే అవినీతి విచారణ చేసి దొషులకు శిక్ష వేయాలిగానీ ఇలా ఆపేయకూడదని కొన్ని వర్గాల నుంచి వాదన వినిపిస్తోంది. ఈ పరిస్తితి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతారని అంటున్నారు. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ ఏపీ ప్రజలకు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
ప్రజలకు అందించే సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టేందుకు జగన్ ప్రభుత్వం కొత్త విధానాలని అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. మొదటగా రేషన్ కార్డుల్లో కోత పెట్టనున్న ప్రభుత్వం మిగిలిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కొన్ని నియమాలు పెట్టనుంది. పింఛన్లు, రేషన్ సదుపాయం ఉండాలంటే మున్సిపాలిటీ పరిధిలో రూ. 75 వేలు, గ్రామీణ పరిధిలో రూ. 65 వేలు లోపే కుటుంబ వార్షిక ఆదాయం ఉండాలి. ఇక ఈ ఆదాయం దాటి ఉంటే వారు ఇకపై రేషన్, పింఛన్‌కు అనర్హులుగా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోనుంది. ఇదే అంశం ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా వర్తించనుంది.
అలాగే కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, కారు కలిగి ఉన్నా, ఐదు ఎకరాలకు పైబడి భూమి ఉన్నా, మిద్దె ఉన్నా, ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్లు ఆధార్‌తో అనుసంధానం ఉన్నట్లయితే వారికి సంక్షేమ పథకాల అందవు. ఇవిగాక పింఛన్‌దారులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు వెచ్చించే వారికి, విద్యుత్ బిల్లు రూ. 750లు పైబడి చెల్లించే వారికి, సొంత ఇల్లు ఉన్నవారికి పై షరతులు వర్తించనున్నాయి. ఇక ఈ ప్రక్రియ త్వరలో అమలు చేసేందుకు జగన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది.