ఇప్పటికే అనేక రిస్కుల్లో ఉన్న వైసీపీకి మరో రిస్క్ పొంచి ఉందనే అంటున్నారు పరిశీలకులు. అది కూడా నిన్న మొన్నటి వరకు నువ్వా-నేనా అని తెగేదాకా లాగిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రూపంలోనేనని అంటున్నారు పరిశీలకులు. ఈ ఏడాది మార్చి లో జరగాల్సిన స్థానిక ఎన్నికలను నిలుపుదల చేయడంతో మొదలైన నిమ్మగడ్డ వర్సెస్ సర్కారు వివాదం అనేక మలుపులు తిరిగింది. ప్రభుత్వం ఏకంగా నిమ్మగడ్డ పదవీ కాలాన్ని తగ్గిస్తూ.. ఆర్డినెన్స్ తీసుకురావడం, దీనిని హైకోర్టు కొట్టేయడం తెలిసిందే. ఈ క్రమంలో వివాదం సుప్రీం గడప తొక్కింది. చివరకు నిమ్మగడ్డ మళ్లీ తన సీటులో కూర్చున్నారు.
ఈ ఎపిసోడ్‌లో సర్కారే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ప్రచారం పుంజుకుంది. చాలా చోట్ల ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా కారణం చూపుతూ.. కనీసం తమతో కూడా చెప్పకుండానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు వాయిదా వేయడాన్ని జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. పోరాటం ప్రారంభించింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు మళ్లీ స్థానిక ఎన్నికల విషయం తెరమీదికి వచ్చింది. ఎన్నికలు ఎందుకు నిర్వహించరు? అని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలంటూ.. దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగింది.
అయితే, కరోనాతో ఆపేస్తున్నామని.. ప్రబుత్వం కోర్టుకు విన్నవించింది. కానీ, ఇతర రాష్ట్రాల్లో ఏకంగా అసెంబ్లీ ఎన్నికలే నిర్వహిస్తున్నారు కదా? అన్న కోర్టు.. ఈవిషయంపై ఎన్నికల కమిషనర్ ఏం చెబుతారో చూస్తామని చెప్పింది. ఇక, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ విషయం పై నిమ్మగడ్డ ఏం చెబుతారు? అనేది కీలకంగా మారింది. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నందున ఇక్కడ కూడా నిర్వహించేందుకు ఓకే అంటే.. ప్రభుత్వం ఏం చెబుతుంది. లేదు.. కరోనా నేపథ్యంలో వాయిదాకే ఓకే అంటే.. సర్కారు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది. కానీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చే దిశగా ఎస్ ఈ సీ అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
అయితే, నిమ్మగడ్డ ఆ పదవిలో ఉన్నంత వరకు సర్కారుకు ఎన్నికల యోచన లేదనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఈ వివాదం ఎటు మలుపు తిరుగుతుంది? అనేది ఆసక్తిగా మారింది. అంతేకాదు.. ఇప్పటి వరకు జరిగిన ఏకగ్రీవాలను కూడా రద్దు చేసి.. మళ్లీ కొత్తగా నోటిపికేషన్ ఇచ్చే ప్రతిపాదన చేస్తే.. మొత్తానికి ఇది మరింత వివాదానికి దారితీస్తుందనే విశ్లేషణలు వస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు ఏం జరిగినా.. ఇక, ఇప్పుడు నిమ్మగడ్డ వంతు వచ్చింది. ఆయన ఏం చేస్తారో చూడాలి.. అని రాజకీయ నేతలు, ప్రభుత్వ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
-vuyyuru subhash