లండన్ లోని కేం బ్రిడ్జ్ యూనివర్సిటీ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై కీలక ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. తనపై నిగా పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పెగాసస్ ఉపయోగించిందని దుయ్యబట్టారు. భారత ప్రజాస్వామ్య మూల స్వరూపం ప్రమాదంలో పడిందని అన్నారు. తన ఫోన్ లోకి కొందరు పెగసస్ జొప్పించారని, చాలామంది రాజకీయ నాయకుల ఫోన్ల పైన ఇలాగే నిలబెట్టారని, దీనిపై కొందరు ఇంటలిజెన్స్ అధికారులు తనకి ఫోన్ చేసి చెప్పినట్లుగా వెల్లడించారు రాహుల్ గాంధీ.
అయితే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. పెగాసస్ ఫోన్లో కాదు ఆయన మైండ్ లో ఉందని మండిపడ్డారు. విదేశీ గడ్డపై కూడా భారత ప్రభుత్వంపై ఏడుస్తారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా ఇండియా గౌరవం పెరిగిందన్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మోడీ గురించి ఏం చెప్పారో వినాలని సూచించారు.