రాజధాని రాజీనామ సవాళ్లలో వైసీపీ,టీడీపీ సత్తా ఎంత

-

అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలంటూ జరుగుతున్న ఉద్యమానికి ఏడాది పూర్తి అయ్యింది. దానితోపాటు ప్రభుత్వ మూడు రాజధానుల ప్రకటన కూడా ఏడాది పూర్తి చేసుకుంది. అయినా వేడి తగ్గడం లేదు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ..రెండు ఒకే అంశంపై రెఫరెండం కోరుతుండటం విశేషం. అయితే మొత్తం అసెంబ్లీని రద్దు చేసి ఫ్రెష్ ఎలక్షన్స్‌కు వెళ్లాలని టీడీపీ డిమాండ్ చేస్తుంటే.. వైసీపీ దాన్ని తిప్పికోడుతోంది. కావాలంటే చంద్రబాబు..ఆయన పార్టీ ఎమ్మెల్యేలే రాజీనామా చేసుకుని రెఫరెండం కోరాలని రివర్స్ అటాక్ చేస్తోంది. రెండు పార్టీలు కోరే రెఫరెండం రాజధానే.. అయితే అంశాలే వేరు. ఇందులో అసలు ఎవరిది రెఫరెండం?


రెఫరెండం రెండు పార్టీల ఉమ్మడి అంశమే అయినా ఒకర్ని ఒకరు బుక్ చేయడానికి దాన్ని వాడుతున్నారు. ఒకరిపై ఒకరు బురద చల్లుకునేందుకు రెఫరెండాన్ని ఆయుధంగా మలుచుకుంటున్నారు. ఒకర్ని మించి ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. టీడీపీ ఆలోచనలు చూస్తే .. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే తమ పరిస్థితి మెరుగు అవుతుందనే ఆశా ఆలోచన ఆ పార్టీకి లేవు. కానీ అమరావతినే రాజధానిగా రాష్ట్రం అంతా కోరుకుంటోందని, అందుకే రెఫరెండానికి ప్రభుత్వం భయపడుతోందని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాల్లో టీడీపీ ఉంది. 151 మంది రాజీనామా చేయాలన్నది టీడీపీ డిమాండ్ చేస్తున్న రెఫరెండంలోని ప్రధాన అంశం.

టీడీపీకి ఎత్తులకు పైఎత్తు వేసింది వైసీపీ. మాకు అధికారం ఇచ్చారు.. మేం నిర్ణయం తీసుకున్నాం. అది మీకు నచ్చకుంటే..మీరే రాజీనామా చేసి మీరే రెఫరెండం కోరండని రివర్స్ అటాక్ చేస్తోంది వైసీపీ. టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలన్నది ఆ పార్టీ డిమాండ్. టీడీపీ నుంచి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. వైసీపీలో చేరకున్నా ఆ పార్టీకి మద్దతుగా ఉన్నారు. మిగిలిన వాళ్లు రాజీనామా చేసి గెలిస్తే .. అప్పుడు చూద్దాం అన్నట్టుగా వైసీపీ మాట్లాడుతోంది. సంక్షేమ పథకాల అమలుతో ఫుల్ జోష్‌లో ఉన్న వైసీపీ ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి గడ్డు పరిస్థితే అని అంచనా వేస్తోంది.

అందుకే టీడీపీ చెప్పిన రెఫరెండానికి ఓకే అంటూనే రాజీనామాలు చేయాల్సింది మీరే అని ఫిటింగ్ పెడుతోంది. అంతేకాదు.కేసీఆర్‌ను కూడా వైసీపీ గుర్తు చేస్తోంది. తెలంగాణ నినాదానికి మద్దతు కోసం గతంలో అనేకసార్లు కేసీఆర్, ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని.. ఇప్పుడు అదే తరహాలో చంద్రబాబు చేయాలని సూచిస్తోంది వైసీపీ. డిమాండ్ల వరకే పరిమితం అయితే ఏం బాగుటుంది అనుకున్నారో ఏమో ఒక్కో ఎమ్మెల్యే రంగంలోకి దిగుతున్నారు. రెఫరెండం కోసం నేను రాజీనామా చేస్తానంటే నేను చేస్తానంటూ వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా రాజీనామాకు సిద్ధపడ్డారు. అయితే జగన్ చెప్పాలని ఆయన షరతు పెట్టారు.

అమరావతే రాజధానిగా ఉంచాలనే డిమాండ్‌తో తాను రాజీనామా చేస్తానని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ ముందుకు వచ్చారు. కృష్ణా జిల్లాకు చెందిన మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే అంశంపై రిజైన్‌ చేసి ఎన్నికలకు రావాలని గద్దె డిమాండ్‌ చేస్తున్నారు. వీరిద్దరితోపాటు ఇంకా ఎంత మంది వస్తారో రెఫరెండం ఎటుపోయి ఏం అవుతుందో కానీ మొత్తానికి హాట్ హాట్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version