ఈ సారి ఇక, ఎల్లో మీడియా తప్పించుకోవడం కష్టమే!-ఇప్పుడు ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట ఇది! ఇదేదో కక్ష పూరితంగానో.. లేక ఉద్దేశ పూర్వకంగానో .. ప్రభుత్వం ఆయా మీడియాలపై చేస్తున్న దాడిగా వారు చెప్పడం లేదు. ఆయా పత్రికలు లేదా మీడియా చానెళ్లు పనిగట్టుకుని ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారంపై సర్కారు పెద్దలు సీరియస్ కావడమే ఇప్పటికే ఒకసారి కొన్ని మీడియా చానెళ్లకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఏదైనా విషయం ఉంటే.. సంబంధిత అధికారులతో రూఢీ పరుచుకుని ప్రచురించాలి లేదా ప్రసారం చేయాలని! కానీ, ఎక్కడా ప్రభుత్వ విజ్ఞప్తిని వారు పట్టించుకోవడం లేదు.
తమకు తోచింది రాసేసి.. నోటికొచ్చింది పేలేసి.. జనాలపైకి వదిలేస్తున్నారు. ఫలితంగా జగన్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఎంత పాజిటివ్ థింకింగ్‌తో ముందుకు వెళ్తున్నా.. ఫలితం ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వం ఈ వ్యతిరేక వార్తా ప్రపంచానికి తనదైన శైలిలో చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు కథనాలు ప్రచురించిన వార్తా పత్రికలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆమోద పబ్లికేషన్స్, ఉషోదయా పబ్లికేషన్స్‌కు నోటీసులు జారీ చేసింది. మైనింగ్‌పై అసత్య ఆరోపణలు చేసినవారిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని ప్రభుత్వ వర్గాలు కొన్నాళ్లుగా చెబుతున్నాయి.
అంతెందుకు.. స్వయంగా సిఎం జగనే ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం వద్దని, ఏదైనా తప్పులు ఉంటే రాయండి సరిచేసుకుంటామని ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే వెల్లడించారు. కానీ, ఆయా సంస్థలు తమ తోక బుద్ధిని వీడలేదు. ఎప్పటికప్పుడు కోడిగుడ్డుపై వెంట్రుకలు పీకే పనిని వేగంగా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటి కే వచ్చిన మైనింగ్ ఆరోపణలు… వ్యతిరేక కథనాలకు సంబంధించి.. ఆయా సంస్థలు, వ్యక్తులు 15 రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో పరువునష్టం దావా వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
తప్పుడు కథనాలకు సంబంధించి ఆయా పత్రికలు స్పందించిన తీరు సంతృప్తికరంగా లేనందునే ఇప్పుడు చర్యలకు ఉపక్రమించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. ఇటీవల సుప్రీం కోర్టు కూడా మీడియా కథనాలపై తీవ్రంగా స్పందించింది. లక్ష్మణ రేఖలు దాటుతుంటే.. ఎవరూ చూస్తూ ఊరుకోరని కూడా వ్యాఖ్యలు సంధించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.