ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు అంటూ పోలీసులను ఎక్కువగా విపక్షాలు టార్గెట్ చేసాయి. తాజాగా ఏపీ డీజీపీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రకటన చేసారు. ప్రశాంతమైన, స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్క పౌరునికి పోలీస్ శాఖ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు ఆయన.
చక్కటి వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పోలీస్ శాఖకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులకు కృతజ్ఞతలు చెప్పారు. మొదటి, రెండు,ముడో విడత పంచాయతీ ఎన్నికలను సమర్థ వంతంగా నిర్వహించిన పోలీసు సిబ్బందిని అభినందించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి వెల్లివిరిసేలా మావోయిస్ట్ ల ఎన్నికల బహిష్కరణ పిలుపును సైతం లెక్కచేయకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కుని ప్రజలు వినియోగించుకునేలా చేయగలిగామని అన్నారు.
ఇప్పటి వరకు జరిగిన మూడు విడతల ఎన్నికలలో ఎక్కువ శాతం పోలింగ్ నమోదయినప్పటికీ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన కొనియాడారు. 2013 ఎన్నికలతో పోలిస్తే, ఈ పర్యాయం అతి తక్కువ అల్లర్లు జరిగినట్లు, పోలీసు శాఖ అత్యంత చొరవ తీసుకొని అహర్నిశలు శ్రమించడం వల్లనే ఇది సాధ్యమైనట్లు ఆయన కొనియాడారు. వృద్దులు, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో తమ వంతు సహాయం చేసిన పోలీసు సిబ్బంది సేవలను కొనియాడారు.