కరెంటు కోతలపై ఏపీ ఇంధన శాఖ కీలక ప్రకటన చేసింది. దసరా పండుగ తర్వాత గ్రామాల్లో, మున్సిపాల్టీల్లో, నగరాల్లో లోడ్ రిలీఫ్ పేరిట గంటల కొద్దీ కరెంటు కోతలు ఉంటాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని వెల్లడించింది. బొగ్గు నిల్వలు, సరఫరాల్లో అంతర్జాతీయంగా, దేశీయంగా ఉన్న పరిణామాలు విద్యుత్ ఉత్పత్తిపై పెను ప్రభావాన్ని చూపుతున్న విషయం అందిరికీ తెలిసిందేనని… ఇంతటి సంక్షోభ సమయంలోనూ వినియోగదారులకు నాణ్యమైన సరఫరా, కరెంటు ఇచ్చేందుకు రాష్ట్ర విద్యుత్‌పంపిణీ సంస్థలు శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నాయని వెల్లడించింది.
ఎలాంటి సమస్యలు లేకుండా విద్యుత్‌ను అందిస్తున్నాయని.. సంక్షోభాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యవసర ప్రణాళికల అమలును వెంటనే ప్రారంభించామని ప్రకటించింది. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏ పి జెన్కో కు అత్యవసరంగా రూ . 250 కోట్లు నిధులు, బొగ్గు కొనుగోలు నిమిత్తం సమకూర్చ బడ్డాయని.. రాష్ట్రానికి అదనంగా రోజుకి దాదాపు 8 బొగ్గు రైళ్లు కేటాయించబడ్డాయని తెలిపింది.
దేశంలో బొగ్గు లభ్యత ఎక్కడవున్నా కొనుగోలు చేయవలసినది గా ఏ . పి జెన్కో కు ఆదేశాలు ఇవ్వ బడ్డాయని.. స్వల్ప కాలిక మార్కెట్ నుంచి ధర ఎంత పలికినా అవసరాల నిమిత్తం కొనుగోలు చేయాల్సిందిగా విద్యుత్ పంపిణి సంస్థలను ఆదేశించామని వెల్లడించింది. కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి ఎవ్వరికి కేటాయింపబడని విద్యుత్ వాటా నుంచి , వచ్చే సంవత్సరం జూన్ వరకు , ఆంధ్ర ప్రదేశ్ కోసం దాదాపు 400 మె . వాట్లు చౌక ధర విద్యుత్ కోసం కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు అభర్ధన పెట్టమని పేర్కొంది.