ఏపీ కీలక నిర్ణయం.. వ్యాక్సిన్ కోసం 18 మందితో కమిటీ !

ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్దంగా ఉండాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. అంటే కరోనా వైరస్ కి వ్యాక్సిన్ రాలేదు. ఒక వేళ వస్తే కరోనా వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే దాన్ని దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను సమన్వయం, పర్యవేక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపహ్యంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రణాళిక కోసం జగన్ ప్రభుత్వం మంగళవారం రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.

మొత్తం 18 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం మన ప్రభుత్వం 18 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చినా మొదట హెల్త్ విభాగంలో పని చేస్తున్న వారికి అందజేస్తాం. తర్వాత ప్రజలందరికీ పంపిణీ చేస్తాం’’ అని మంత్రి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.