ఎందుకో కానీ ప్రభుత్వాలు ఇప్పుడు భూ దందాల మీద ద్రుష్టి పెడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణా సిఎం కేసీఆర్ ఏకంగా తెలంగాణా రెవెన్యూ చట్టాన్నే సమూలంగా మార్చేశారు. భూ దందాను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన ప్రకటించడం గమనార్హం. అయితే ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా
రియల్ ఎస్టేట్ మాఫియాకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఏపీ వ్యాప్తంగా ఉన్న అనధికార అక్రమ లే అవుట్లను గుర్తించి జాబితాని కూడా సిద్దం చేసింది.

మొత్తం ఏపీలో 34,167 ఎకరాల విస్తీర్ణంలో 6076 అక్రమ, అనధికార లే అవుట్లు ఉన్నట్టు గుర్తించారు. ఇందులో నిబంధనలకు విరుద్దంగా ఉన్నవి.. ప్రభుత్వ భూములను కబ్జా చేసినవి.. వివాదాల్లో ఉన్న లే అవుట్లను గుర్తించిన అధికారులు జిల్లాల వారీగా జాబితాను రెడీ చేశారు. అనుమతుల్లేని లే అవుట్లల్లోని ప్లాట్లను రిజిస్టర్ చేయొద్దని సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఇక అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో అక్రమ లే అవుట్లున్నాయని తేలగా, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో అక్రమ లే అవుట్లు ఉన్నాయని తేలింది.