ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రోఫెసర్‌కు లెఫ్ట్‌ పార్టీలు హ్యాండిచ్చాయా…?

-

ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఊహించని రాజకీయ పరిణామాలకు దారితీస్తోంది. ఇక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు ప్రొఫెసర్‌ కోదండరామ్‌. కాంగ్రెస్‌పార్టీ మద్దతు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. లెఫ్ట్‌ పార్టీల మద్దతు కూడా కోదండరామ్‌కే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ.. CPI,CPMలు ట్విస్ట్‌ ఇచ్చాయి. సీపీఐ బలపరిచిన ABNజర్నలిస్ట్‌ జయసారధికి మద్దతిస్తున్నట్టు సీపీఎం ప్రకటించింది. ఒక్క న్యూ డెమోక్రసీ మాత్రమే కోదండరామ్‌కు మద్దతిస్తున్నట్టు ప్రకటన చేసింది. దీంతో ఖమ్మం జిల్లాలో లెఫ్ట్‌ పార్టీల నిర్ణయం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐతో సీపీఎం కలవడం ఓ ఎత్తు అయితే.. ప్రొఫెసర్‌కు మద్దతివ్వకుండా వేరుగా అభ్యర్థిని బరిలో దింపడం మరో ఎత్తు. కాంగ్రెస్‌ పార్టీ ఇంకా తన నిర్ణయం ఏంటో ప్రకటించ లేదు. సొంతంగా అభ్యర్థిని బరిలో దించుతుందా? లేక కోదండరామ్‌కు మద్దతిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. దీనిపై ఓ కమిటీని కూడా వేసింది కాంగ్రెస్‌.

 

టీఆర్‌ఎస్‌ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరోసారి బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ లెఫ్ట్‌, కాంగ్రెస్‌ పార్టీలు కోదండరామ్‌కు మద్దతిచ్చి ఉంటే పోటీ పరిణామాలు మరో ఉండేవి. కానీ.. విపక్ష ఓటు చీలే పరిస్థితి కనిపిస్తోంది. ఇదేస్థానం నుంచి మాజీ మంత్రి ఇ.పెద్దిరెడ్డి పేరు బీజేపీ నుంచి ప్రచారంలో ఉంది. ఇలా ఉద్దండులు బరిలో ఉంటున్న సమయంలో కోదండరామ్‌కు లెఫ్ట్ పార్టీలు కటీఫ్‌ చెప్పడమే ఎవరికీ అంతుచిక్కడం లేదట. అయితే ఈ వ్యవహారం వెనుక ఓ మంత్రి హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. సీపీఐతో మంచి సంబంధాలున్న ఆ మంత్రి ఈ మొత్తం కథ నడిపించినట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news