మద్యం అక్రమ రవాణ నిరోధానికే మద్యం ధరల సవరణ చేశామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ పేర్కొన్నారు. అందుకే తక్కువ బ్రాండ్ల ధరలను గణనీయంగా తగ్గించామన్న ఆయన 90 శాతం మేర మద్యం వినియోగం తక్కువ రకం బ్రాండ్లదేనని పేర్కొన్నారు. ఎక్కువ రేట్లకు ఈ మద్యం అమ్మడం కారణంగా శానిటైజర్లు, మిథైల్ ఆల్కహల్ తాగుతుండడం వల్ల కొన్ని చోట్ల మరణాలూ సంభవించాయని అయన అన్నారు. దానిని కూడా దృష్టిలో ఉంచుకుని మద్యం ధరల్లో సవరణ చేశామని అన్నారు.
తక్కువ బ్రాండ్ రకం ధరలు తెలంగాణ కంటే ఏపీలో ఇప్పుడు తగ్గిందని, దీని వల్ల తెలంగాణ నుంచి మద్యం అక్రమ రవాణ తగ్గుతుందని భావిస్తున్నామని అన్నారు. ఇవాళ్టి నుంచే సవరించిన ధరలు వర్తిస్తాయని ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ధరలు సవరించాలని ప్రభుత్వానికి ఎస్ఈబీ సిఫార్సు చేసింది. శానిటైజర్లు, మిథైల్ ఆల్కాహాల్ సేవనంతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఉన్నాయని ఎస్ఈబీ నివేదికలో పేర్కొంది. దీన్ని అరికట్టేందుకు ధరలు సవరించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎస్ఈబీ, ఎస్ఈబీ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో మద్యం ధరల్ని సవరిస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు చెబుతున్నారు.