రేపే ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల పై ఏపీ శాఖ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. రేపు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఈ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాలపై ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం మేరకే.. రేపు ఫలితాలను విడుదల చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

టెన్త్ పరీక్షల ఫలితాలు ప్రకటించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని ఆదిమూలపు సురేశ్ తెలిపారు. కాగా కరోనా మహమ్మారి  కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే. దాంతో ఫలితాలు ఎలా ఉంటాయోనని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఇటీవలే టెన్త్, ఇంటర్ ఫలితాలపై ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే రేపు ఫలితాలను విడుదల చేయనుంది.