నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల నుంచి 7 టీఎంసీల నీటిని అత్యవసరంగా విడుదల చేయాలని కేఆర్ఎంబీకి లేఖ రాసింది ఏపీ జలవనరుల శాఖ. కుడి ప్రధాన కాలువ నుంచి 6 టీఎంసీలు, ఎడమ కాలువ ద్వారా ఏపీ సరిహద్దు ప్రాంతాలకు 1 టీఎంసీ నీటిని విడుదల చేసేలా తెలంగాణా అధికారులను ఆదేశించాలని లేఖ రాసింది. వేసవి దృష్ట్యా తాగునీటి అవసరాలకు , ఎండిపోయే దశలో ఉన్న పంటలకు నీరు అవసరమని కోరిన ఏపీ… తక్షణం నాగార్జున సాగర్ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీరిచ్చేలా తెలంగాణాను ఆదేశించాలని కోరుతూ లేఖ రాసింది.
కృష్ణాబేసిన్ లో దఖలు పడిన నీటి వినియోగ వాటాలో 163 టీఎం సీలను ఏపీ ఇంకా వినియోగించుకునే అవకాశముందని పేర్కోంటూ లేఖ రాసింది. తెలంగాణా కేవలం 326 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవాల్సి ఉన్నా 417 టీఎంసీలు వాడేసిందని పేర్కొంది ఏపీ. ఇక ఏపీ ఇప్పటి వరకూ తనకు దక్కిన వాటాలో 53 శాతం నీటిని మాత్రమే వినియోగించుకుందని కేఆర్ఎంబీకి స్పష్టం చేసిన అధికారులు… ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి ఇంకా 126 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఏపీకి ఉందని లేఖలో వెల్లడించారు. తక్షణావసరంగా ఎండిపోతున్న పంటలు, తాగునీటి అవసరాల కోసం 7 టీఎంసీల నీటిని విడుదల చేసేలా ఆదేశించాలని లేఖలో తెలిపింది ఏపీ.