గుడ్ల ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు మెరుగైన స్థానాలు దక్కించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న మొత్తం గుడ్లలో ఏపీ నుంచి 20.41%, తెలంగాణ నుంచి 12.86% వస్తున్నట్లు ‘పశుసంవర్థక ప్రాథమిక గణాంకాలు-2022’ నివేదిక వెల్లడించింది.
గుడ్ల ఉత్పత్తి 6.19% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. 2021-22లో 129.60 బిలియన్ల గుడ్లు దేశంలో ఉత్పత్తి అయ్యాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ (20.41%), తమిళనాడు (16.08%), తెలంగాణ (12.86%), పశ్చిమబెంగాల్ (8.84%), కర్ణాటక (6.38%) మొదటి 5 స్థానాల్లో నిలిచాయి.
మరోవైపు ఈ నివేదిక ప్రకారం 2021-22లో దేశంలో పాల ఉత్పత్తి 221.06 మిలియన్ టన్నులకు చేరింది. 5.29% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఈ విషయంలో రాజస్థాన్ (15.05%), ఉత్తర్‌ప్రదేశ్ (14.93%), మధ్యప్రదేశ్ (8.06%), గుజరాత్ (7.56%), ఆంధ్రప్రదేశ్ (6.97%) తొలి 5 స్థానాలను ఆక్రమించాయి.
2021-22లో తలసరిన రోజూ 444 గ్రాముల పాలు లభ్యమయ్యాయని ఈ నివేదిక వెల్లడించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే తలసరి లభ్యత 17 గ్రాములు పెరిగిందని తెలిపింది తలసరి గుడ్ల లభ్యత 90 నుంచి 95కి పెరిగిందని.. మాంసం తలసరి లభ్యత 0.30 కిలోలు పెరిగి 6.82 కేజీలకు చేరిందని నివేదిక పేర్కొంది.