Kaikala Satyanarayana: తెలుగు సినీ పరిశ్రమ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్నా.. ఆయనను ఉదయం అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం సత్యనారాయణ వెంటిలెటర్ పై చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా కైకాల సత్య నారాయణ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది అపోలో మెనేజ్ మెంట్.
ఈ బులిటెన్ ప్రకారం..”సత్యనారాయణ ఈ రోజు ఉదయం 7.30 నిమిషాలకు జ్వరంతో అపోలోలో చేరారు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అవడం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది. కోవిడ్ తర్వాత ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం కైకాల వెంటిలెటర్ పై చికిత్స పొందుతున్నారు. కానీ.. ఆశించిన మేరకు స్పందించడం లేదు.” అని హెల్త్ బులిటెన్ లో వైద్యులు తెలిపారు. కైకాల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. ఆయన అభిమానులు క్షేమంగా తిరిగి రావాలంటూ పూజలు చేస్తున్నారు.
కైకాల సత్యనారాయణ 1959 లో సిపాయి కూతురు అనే చిత్రంతో వెండి తెరపై అడుగుపెట్టారు. ఆయన హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు ఇలా ఎన్నో పాత్రల్లో నటించారు. ఆయన ఏ పాత్రలో నటించినా.. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి.. ఆ పాత్రకు జీవం పోసేవాడు. తెలుగు చిత్ర సీమలో నవరస నట సార్వభౌమగా ఖ్యాతిగాంచారు. గత 60 ఏళ్లుగా సినీ రంగంలో దాదాపు 800 పైగా చిత్రాల్లో నటించారు. చివరిగా 2019లో ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహేష్ బాబు మహర్షి సినిమాలో నటించారు. ఆ తర్వాత కరోనా లాక్ డౌన్ మొదలవడంతో ఆయన బయటకు రాలేదు. అయితే అప్పటి నుంచి కూడా అయన ఇంటి పట్టునే ఉంటున్నారు.