కాంగ్రెస్‌లో వైఎస్ఆర్‌టీపీ విలీనానానికి సంబంధించి ఆ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల రెండు రోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్‌టీపీ విలీనం చేసే విషయమై ఈ ఏడాది ఆగస్టు 31న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో వైఎస్ షర్మిల చర్చించిన విషయం తెలిసిందే. తమ మధ్య నిర్మాణాత్మకంగా చర్చలు జరిగాయని వైఎస్ షర్మిల ప్రకటించారు. ముఖ్యంగా గత కొంతకాలంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో చర్చలకు డీకే శివకుమార్ చొరవ చూపారు. డీకే శివకుమార్ సూచన మేరకు వైఎస్ షర్మిల నిన్న సోనియాతో భేటీ అయ్యారు.
తాజాగా ఏపీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరికపై ఏఐసీసి నుండి ఎలాంటి సమాచారం లేదు అని తెలిపారు. షర్మిల కామెంట్స్ బట్టి ఆమె తెలంగాణ రాజకీయాలకు పరిమితం కావచ్చు అన్నారు తులసి రెడ్డి. షర్మిల కాంగ్రెస్ లో చేరి , ఏపీ రాజకీయాల్లోకి వస్తే.. తప్పకుండా ఆహ్వానిస్తాం అన్నారు తులసిరెడ్డి. షర్మిల వచ్చినంత మాత్రాన అద్భుతాలు జరగవు. పార్టీకి కొంత మేలు జరుగుతుంది అని తెలిపారు తులసి రెడ్డి. షర్మిల వస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, చంద్రబాబుకు నష్టం, పరోక్షంగా జగన్ కు మేలు జరుగుతుంది.షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నష్టం , కేసిఆర్ కు లాభం జరుగుతుంది అని తెలిపారు తులసిరెడ్డి.