సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ ఆకట్టుకునే ఉత్పత్తులను తయారు చేసి అందివ్వడంలో ఇతర కంపెనీల కన్నా ఎప్పుడూ ముందే ఉంటుంది. ఎప్పటికప్పుడు నూతన తరహాలో ఫోన్లు, ఐప్యాడ్లు, మాక్‌బుక్‌లను తయారు చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇక యాపిల్‌కు చెందిన ఎయిర్‌పాడ్స్‌కు కూడా చక్కని ఆదరణ లభిస్తోంది. అయితే వాటిని తలదన్నేలా యాపిల్ నూతన తరహా హెడ్ ఫోన్స్‌ను తాజాగా మార్కెట్‌లో విడుదల చేసింది. ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ పేరిట ఆ హెడ్ ఫోన్స్ విడుదలయ్యాయి.
యాపిల్ విడుదల చేసిన ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ హెడ్ ఫోన్స్ ను అత్యంత ప్రీమియం మెటీరియల్‌తో రూపొందించారు. అందువల్ల వీటిని ధరిస్తే యూజర్లకు చాలా కమ్‌ఫర్ట్‌గా ఉంటుంది. వీటిల్లో 40 ఎంఎం యాపిల్ డిజైన్డ్ డైనమిక్ డ్రైవర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే యాపిల్ డిజైన్ చేసిన హెచ్1 చిప్‌ను అమర్చారు. అందువల్ల వీటి నుంచి వెలువడే సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది.
ఇక ఈ హెడ్ ఫోన్స్‌లో కస్టమ్ అకౌస్టిక్ డిజైన్‌ను ఇచ్చారు. స్టెయిన్‌లెస్ స్టీల్ హెడ్ బ్యాండ్ ఫ్రేమ్ ఉంటుంది. దీని వల్ల ఎలాంటి షేప్‌లో ఉన్న తలకైనా చాలా సులభంగా ఇవి ఫిట్ అవుతాయి. అలాగే సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. ఇక హెడ్ ఫోన్స్ మెత్తని కుషన్‌ను కలిగి ఉంటాయి. అందువల్ల ఎక్కువ సేపు ధరించినా అసౌకర్యానికి గురి కారు.
కాగా ఈ హెడ్ ఫోన్స్‌లో అడాప్టిప్ ఈక్యూ, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్‌పరెన్సీ మోడ్, స్పేషియల్ ఆడియో, డాల్బీ అట్మోస్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. వీటిని ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 20 గంటల వరకు పనిచేస్తాయి. కేవలం 5 నిమిషాల పాటు చార్జింగ్ పెడితేనే 1.5 గంటల పాటు వీటిని వాడుకోవచ్చు.
యాపిల్ ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ హెడ్ ఫోన్స్ స్పేస్ గ్రే, సిల్వర్, స్కై బ్లూ, గ్రీన్, పింక్ కలర్ ఆప్షన్లలో విడుదలయ్యాయి. డిసెంబర్ 15వ తేదీ నుంచి వీటిని భారత్‌లో విక్రయిస్తారు. వీటి ధర రూ.59,990గా ఉంది.