సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ ఐఫోన్ 12 ఫోన్లను ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న ఈవెంట్‌లో విడుదల చేయనున్న విషయం విదితమే. ఆ ఈవెంట్‌కు యాపిల్ హాయ్, స్పీడ్ అని పేరు కూడా పెట్టింది. అయితే ఆ ఈవెంట్ కన్నా ముందుగానే ఐఫోన్ 12 ఫోన్లకు చెందిన పలు స్పెసిఫికేషన్లు, ధరలు లీకయ్యాయి.
యాపిల్ సంస్థ ఈసారి ఏకంగా 4 ఐఫోన్ మోడల్స్ ను విడుదల చేస్తున్నట్లు తెలిసింది. ఐఫోన్ 12 మినీ, 12, 12 ప్రొ, 12 ప్రొ మ్యాక్స్ పేరిట నాలుగు మోడల్స్ విడుదల కానున్నట్లు సమాచారం. ఇవన్నీ ఓలెడ్ డిస్‌ప్లేలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. అలాగే వీటిల్లో 5జి ఫీచర్‌ను అందిస్తారని తెలిసింది. ఇక ఆ ఫోన్లలో 4జి నుంచి 5జికి మారేందుకు స్మార్ట్ డేటా మోడ్ అనే ఫీచర్‌ను అందిస్తుందని తెలిసింది.
కొత్త ఐఫోన్లకు 15 వాట్ల వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తారని సమాచారం. ఐఫోన్ 12 మినీలో 5.4 ఇంచుల డిస్‌ప్లేను, ఐఫోన్ 12, 12 ప్రొలలో 6.1 ఇంచుల డిస్‌ప్లేను, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్‌లో 6.7 ఇంచుల డిస్‌ప్లేను అందిస్తారని సమాచారం. ఇక గతంలో వచ్చిన ఐఫోన్ 4 మాదిరి డిజైన్‌లో వీటిని రూపొందించారని తెలుస్తోంది.
ఐఫోన్ 12 మినీ ధర 699 డాలర్లుగా ఉంటుందని సమాచారం. అలాగే ఐఫోన్ 12 ధర 799 డాలర్లుగా, 12 ప్రొ ధర 999 డాలర్లుగా, 12 ప్రొ మ్యాక్స్ ధర 1099 డాలర్లుగా ఉంటుందని తెలుస్తోంది. వీటిని గోల్డ్, సిల్వర్, గ్రాఫైట్, బ్లూ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేస్తారని సమాచారం.
అక్టోబర్ 13న ఐఫోన్ 12 ఫోన్లను రిలీజ్ చేస్తే అక్టోబర్ 16 లేదా 17 తేదీల్లో ఐఫోన్ 12 మినీ, 12 ఫోన్లకు ప్రీ ఆర్డర్లను ప్రారంభిస్తారని తెలుస్తోంది. అలాగే అక్టోబర్ 23 నుంచి వీటిని విక్రయిస్తారని సమాచారం. అదేవిధంగా ఐఫోన్ 12 ప్రొ, 12 ప్రొ మ్యాక్స్‌లకు నవంబర్ 13 లేదా 14 నుంచి ప్రీ ఆర్డర్లను ప్రారంభిస్తారని, నవంబర్ 20 లేదా 21 తేదీల నుంచి వీటిని విక్రయిస్తారని తెలుస్తోంది.
యాపిల్ తన ఈవెంట్‌లో ఐఫోన్ 12 ఫోన్లతోపాటు హోంపాడ్ మినీ పేరిట స్మార్ట్ స్పీకర్‌ను కూడా లాంచ్ చేస్తుందని తెలిసింది. దీని ధర 99 డాలర్లుగా ఉంటుందని సమాచారం. దీన్ని భారత్‌లో సుమారుగా రూ.12వేలకు విక్రయించనున్నారని తెలిసింది.