ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్కెట్లలో సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ కు చెందిన ఐఫోన్లకు, శాంసంగ్ గెలాక్సీ ఫోన్లకు అత్యధిక వాటా ఉంటుంది. అయితే భారత్‌కు వచ్చే సరికి కొత్త ఫోన్ల మార్కెట్‌లో షియోమీ నంబర్ వన్ స్థానంలో ఉంది. కానీ భారత్‌లో సెకండ్ హ్యాండ్ ఫోన్ల మార్కెట్‌లో యాపిల్ ఐఫోన్లే మెజారిటీ వాటాను కలిగి ఉన్నాయి. భారత్‌లో సెకండ్ హ్యాండ్ ఐఫోన్లను చాలా మంది కొనుగోలు చేస్తున్నారని ఓ సర్వేలో వెల్లడైంది.
భారత్‌లో సెకండ్ హ్యాండ్ ఫోన్ల మార్కెట్‌లో యాపిల్ ఐఫోన్ల వాటా 21 శాతంగా ఉంది. అందువల్ల భారత్‌లో సెకండ్ హ్యాండ్ ఫోన్ల మార్కెట్‌లో ఐఫోన్లదే అగ్రస్థానం అని చెప్పవచ్చు. ఇక ఆ తరువాత స్థానంలో 18 శాతం వాటాతో షియోమీ కొనసాగుతోంది. సెకండ్ హ్యాండ్ ఫోన్లలో ఐఫోన్ల తరువాత వినియోగదారులు ఎక్కువగా కొంటున్నది షియోమీ ఫోన్లే కావడం విశేషం. అలాగే శాంసంగ్ కంపెనీ ఈ మార్కెట్‌లో 17 శాతంతో కొనసాగుతోంది.
ఇక వన్‌ప్లస్, వివో, ఒప్పో, రియల్‌మి కంపెనీలకు చెందిన సెకండ్ హ్యాండ్ ఫోన్లకు అన్నింటికీ కలిపి మార్కెట్‌లో 30 శాతం వాటా ఉంది. ఈ మేరకు ఓఎల్ఎక్స్‌లో సేకరించిన వివరాల ప్రకారం ఈ విషయాలు వెల్లడయ్యాయి.
కాగా లాక్‌డౌన్ సమయంలో 61 శాతంగా ఉన్న సెకండ్ హ్యాండ్ ఫోన్ల సప్లై అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఏకంగా 44 శాతం పెరిగింది. అంటే అన్‌లాక్ ప్రక్రియ సమయంలో చాలా మంది సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపించారని అర్థమవుతుంది. ఫోన్ల వినియోగం పెరుగుతుండడం, ప్రస్తుతం అనేక మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో క్లాసులకు హాజరవుతుండడంతోనే సెకండ్ హ్యాండ్ ఫోన్లను ఎక్కువగా కొంటున్నారని స్పష్టమవుతుంది. ఈ మార్కెట్‌లో ఐఫోన్లను ఎక్కువగా కొంటున్నారంటే నిజంగానే ఆశ్చర్యం కలుగుతోంది.