ప్రతి ఏడాది సెప్టెంబర్ నెల వస్తుందంటే చాలు.. ఆపిల్ ఐఫోన్ ప్రియులందరూ కొత్త ఐఫోన్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలోనే సాధారణంగా ఆపిల్ కంపెనీ తన కొత్త ఐఫోన్లను విడుదల చేస్తుంటుంది. అలాగే ఐఓఎస్ నూతన అప్‌డేట్లను, ఇతర డివైస్‌లు, యాక్ససరీలను కూడా ఆపిల్ ఆ నెలలోనే విడుదల చేస్తుంటుంది. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ నెల కూడా వచ్చేస్తోంది. కానీ కరోనా కారణంగా ఈ సారి కొత్త ఐఫోన్లను విడుదల చేస్తారా, లేదా.. అన్న సందేహాలు నెలకొన్నాయి.
ఆపిల్ తన ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లను సెప్టెంబర్ 8వ తేదీన విడుదల చేస్తుందని తెలిసింది. కరోనా ఉన్నప్పటికీ అదే తేదీన ఐఫోన్ 12 ఫోన్లను విడుదల చేస్తుందని తెలుస్తోంది. అయితే ఎప్పటిలా ఈవెంట్ నిర్వహించకుండా కేవలం ఆన్‌లైన్‌లోనే ఈ ఫోన్లను విడుదల చేస్తారని తెలిసింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఆపిల్ తన ఐఫోన్ ఎస్ఈ 2020 ఎడిషన్‌కు గాను ఎలాంటి ఈవెంట్‌ను నిర్వహించకుండానే నేరుగా ఫోన్‌ను విడుదల చేసింది. కనీసం ఆన్‌లైన్ ఈవెంట్‌ను కూడా ఆపిల్ నిర్వహించలేదు. కానీ.. ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లకు మాత్రం ఆన్‌లైన్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలిసింది.
ఇక కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయా దేశాల్లో ఉన్న ఆపిల్ ప్లాంట్లలో ఫోన్ల ఉత్పత్తి ఆగలేదు. కనుక ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లను విడుదల చేసి.. కొంత ఆలస్యంగానైనా వాటి అమ్మకాలను ఆపిల్ ప్రారంభిస్తుందని సమాచారం. కాగా కొత్త ఐఫోన్లలో 5జి ఫీచర్ ఉంటుందని తెలిసింది. అయితే అక్టోబర్ 27న మరో ఈవెంట్‌ను కూడా ఆపిల్ నిర్వహిస్తుందని తెలుస్తోంది. అందులో వాచ్ సిరీస్ 6 ఆపిల్ వాచ్‌లను, కొత్త ఐప్యాడ్ ప్రొను, సిలికాన్ పవర్డ్ మాక్‌బుక్‌లను, ఆపిల్ గ్లాస్‌ను ఆ సంస్థ విడుదల చేస్తుందని తెలుస్తోంది.