ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు సిట్ నియామకం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై ఇవాళ రాత్రిలోగా అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. ఏడీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. హింసాత్మక ఘటనలపై ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో విచారణ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. రేపటిలోగా పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చోటు చేసుకున్న ప్రతి ఘటన పైనా ఈసీకి నివేదిక ఇవ్వనుంది సిట్. సిట్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనుంది ఈసీ. హింసాత్మక ఘటనలకు కారణమైన కొందరు కీలక నేతల అరెస్టులు జరిగే అవకాశం ఉంది.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన.. కొందరు అభ్యర్థులతో అంటకాగిన పోలీసు అధికారులపై తీవ్ర చర్యలు తీసుకునే సూచనలు ఉన్నాయి. ఘటనలు చోటు చేసుకున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను గృహ నిర్బంధం చేస్తున్నారు. ఆయా అభ్యర్థుల ఇళ్ల వద్ద సాయుధ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతమున్న బలగాలకు అదనంగా 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాల మోహరించారు.
ఇప్పటికే 20 కంపెనీల పారామిలటరీ బలగాలు ఏపీకి చేరుకున్నయి. కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతను రెండంచెల నుంచి మూడంచెలకు పెంచారు. స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ ఏర్పాట్ల పర్యవేక్షణ నిమిత్తం క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లనున్నారు ఏపీ సీఈఓ. మూడు జిల్లాల్లో జరిగిన హింసై విచారణ చేయనుంది సిట్. విచారణ తరువాత కేంద్ర ఎన్నికల కమిషన్ కు నివేదిక ఇవ్వనుంది సిట్.