ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీలను ఏపీఎస్‌ఆర్టీసీ పెంచింది. పెంచిన బస్సు ఛార్జీలు బుధవారం(డిసెంబర్ 11) ఉదయం నుంచి అమల్లోకి రానున్నాయి. పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు పెంచాలని నిర్ణయించిన ఏపీఎస్ ఆర్టీసీ… మిగతా సర్వీసుల్లో మాత్రం కిలోమీటర్‌కు 20 పైసలు పెంచాలని నిర్ణయించింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడాలంటే ఛార్జీలు పెంచడం తప్పనిసరి అని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
బస్సు ఛార్జీల పెంపు కారణంగా ప్రజలపై ఏడాదికి రూ. 900 కోట్ల అదనపు భారం పడనుంది. డీజిల్ ధరలు పెరిగినప్పటికీ ఇప్పటివరకు బస్ ఛార్జీలు పెరగలేదని… ఆ భారాన్ని తగ్గించుకునేందుకు ఛార్జీలు పెంచాల్సి వస్తోందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. రెండు రోజుల క్రితమే దీనిపై నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం… ఛార్జీ పెంపును సాధ్యమైనంత తొందరగా అమలు చేయాలని నిర్ణయించింది.