ఆ పార్క్‌లో రాత్రుళ్లు దెయ్యాలు వ్యాయామాలు చేస్తున్నాయా..?

-

పార్క్‌కు వెళ్తే ఆ ప్రకృతికి మనసుకు హాయిగా అనిపిస్తుంది. సాయంత్రం వేళ అలా గడ్డిపై నడుస్తుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ మధ్య పార్క్‌ల్లో ఓపెన్‌ జిమ్‌ సదుపాయం కూడా ఉంటుంది. అక్కడ పిల్లలు, పెద్దలు వ్యాయామం చేస్తుంటారు. కానీ ఈ గార్డెన్‌లో దెయ్యాలు రాత్రుళ్లు వ్యాయామం చేస్తున్నాయట. దెబ్బకి భయపడి ఆ దిక్కు వెళ్లడమే మానేశారు స్థానిక ప్రజలు. దెయ్యాలు వ్యాయామం చేయడం ఏంట్రా అనుకుంటున్నారా..? ఆ సంగతేంటో మీరు చూసేయండి.!

రాజస్థాన్‌లో దౌసా ప్రాంతంలోని నెహ్రూ గార్డెన్‌లో ఓపెన్ జిమ్‌ ఉంది. అక్కడికి యువకులు వ్యాయామం కోసం వస్తుంటారు. ఈ జిమ్ స్థానికంగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు ఇక్కడ వ్యాయామం చేసేందుకు క్యూలో నిలబడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరూ తిరగని పరిస్థితి ఉంది. దీనికి కారణం వైరల్ అయిన ఒక వీడియో.

వైరల్ వీడియోలో ఈ జిమ్‌లోని చెస్ట్ ప్రెస్ మెషిన్ టేబుల్ రాత్రి చీకటిలో ఆటోమేటిక్‌గా కదులుతూ ఉంది. గాలి వీచినప్పుడు ఒక వస్తువు ఎలా కదులుతుందో అలా అది కదులుతున్నట్లు కనిపించింది. ఆ మెషిన్ టేబుల్‌పై ఎవరైనా వ్యాయామం చేస్తున్నారా అని ఆశ్చర్యపోయే విధంగా అది కదిలింది. ఆ వీడియో చూసిన తర్వాత చాలా మందికి ఈ జిమ్‌లో దెయ్యం ఉందా అనే అనుమానం వచ్చింది. రాత్రిపూట జిమ్‌లో దెయ్యాలు వచ్చి వ్యాయామం చేస్తున్నాయని పుకార్లు షికార్లు కొట్టాయి.

చిన్నారుల్లో భయానక వాతావరణం ఏర్పడి ప్రస్తుతం గార్డెన్‌లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. వారి తల్లిదండ్రులు కూడా వారిని పంపట్లేదు. అందువల్ల నాలుగు రోజులుగా గార్డెన్, జిమ్ రెండూ నిర్మానుష్యంగా ఉన్నాయి. జిమ్‌ చేసేందుకు వచ్చే వాళ్లతో రద్దీగా ఉండే ఆ పార్క్‌ ఇప్పుడు ఆ ఒక్క వీడియోతో దెబ్బకి ఖాళీ అయింది.

ఈ దెయ్యం వాదనను కొందరు స్థానికులు తోసిపుచ్చారు. “ఆ వీడియో వాట్సాప్ గ్రూపులో షేర్ అవుతోంది. కాబట్టి మేము జిమ్‌కి వెళ్లి ఆ మెషిన్‌ను ప్రయత్నించాము, వ్యాయామం చేసేటప్పుడు యంత్రం కదలిక.. వీడియోలోని కదలిక లాగా లేదు. కాబట్టి ఆ వీడియో ఫేక్’ అని కొందరు స్థానికులు తెలిపారు. మెషిన్‌లో స్ర్పింగ్‌ లూస్‌ అవడం వల్లే ఇలా ఆటోమెటిక్‌గా కదలుతుందని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా భయం మనిషితో ఏదైనా నమ్మేలా చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news