థంబ్స్‌ అప్‌ ఎమోజీ పంపినందుకు రూ. 50 లక్షలు జరిమానా కట్టిన రైతు

-

చాటింగ్‌లో ఏదైనా ఓకే చెప్పాల్సి వచ్చినప్పుడు థంబ్స్‌ అప్‌ సింబల్‌ను పెడుతుంటాం. అలా పెట్టినందుకే ఓ రైతుకు రూ. 50 లక్షల జరిమానా వేసింది కోర్టు. ఓర్ని ఇదేం గోలరా నాయనా అనుకుంటున్నారా..? మనోడు ఎక్కడ థంబ్స్‌ అప్‌ ఎమోజిని వాడడో. కెనడాలోని సస్కట్చేవాన్‌కి చెందిన ఓ రైతు థంబ్స్ అప్ ఎమోజీని టెక్స్ట్‌ మెసేజ్‌లో సెండ్‌ చేసినందుకు ఏకంగా రూ.50 లక్షలు ($61,610) పెనాల్టీ కట్టాల్సి వచ్చింది.

కెనడియన్ రైతు క్రిస్ అచ్టర్, ఒక కొనుగోలుదాడికి ఇచ్చిన రెస్పాన్స్‌ వివాదాస్పదం అయింది. ఫ్లాక్స్‌ (అవిసెలు) డెలివరీ చేయడానికి సంబంధించిన అగ్రిమెంట్‌ను రైతు తప్పుగా అర్థం చేసుకున్నాడు. కెంట్ మిక్కిల్‌బరో అనే బయ్యర్‌, అచ్టర్‌కు అవిసెల కొనుగోలుకు సంబంధించిన కాంట్రాక్ట్ డాక్యుమెంట్‌ సెండ్‌ చేశాడు, అలానే కన్ఫర్మ్‌ చేయమని కోరాడు. ఆ మెసేజ్‌కు అచ్టర్.. ‘ సరే అలాగే కన్ఫర్మ్‌ చేస్తాను’ అనే ఉద్దేశంతో థంబ్స్ అప్ ఎమోజీని పంపాడు. అయితే మిక్కిల్‌బరో మాత్రం, ఆ ఎమోజీని కాంట్రాక్ట్ నిబంధనలు, షరతులకు అచ్టర్ అంగీకరిస్తున్నట్లుగా అర్థం చేసుకున్నాడు. అచ్టర్ టెక్స్ట్ మెసేజ్‌ ద్వారా ఒప్పందాలకు అంగీకరించినట్లు మిసండర్‌స్టాండ్‌ చేసుకున్నాడు.

అచ్టర్ ఏం చెబుతున్నాడంటే?

మిసండర్‌స్టాండింగ్‌ జరిగిన తర్వాత.. ఫ్లాక్స్ డెలివరీ కాంట్రాక్ట్‌ గురించి మెసేజ్ వచ్చిందని ధ్రువీకరించడం మాత్రమే తన ఉద్దేశమని అచ్టర్ స్పష్టం చేశాడు. కాంట్రాక్ట్‌లో పేర్కొన్న నిబంధనలు, షరతులకు అంగీకారం చెబుతున్నట్లు థంబ్స్ అప్ ఎమోజీ సెండ్ చేయలేదన్నాడు. అంతే ఈ వివాదం కాస్తా కోర్టుకు చేరింది.

కోర్టు తీర్పు

అయితే డాక్యుమెంట్‌పై సంతకం చేయడానికి థంబ్స్ అప్ ఎమోజీని ఉపయోగించడం సంప్రదాయ విరుద్ధమని కేసు విచారణ సందర్భంగా కోర్టు జడ్జి అంగీకరించారు. కానీ, నిర్దిష్ట పరిస్థితిలో ఎమోజీని సంప్రదాయ సంతకంగా పరిగణించే అవకాశాలు ఉన్నాయని, దీన్ని కంట్రాక్ట్‌కు అంగీకారం చెప్పినట్లుగా భావించవచ్చని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఫలితంగా అగ్రిమెంట్‌ ప్రకారం 86 టన్నుల ఫ్లాక్స్ డెలివరీ చేయడంలో విపలమైనందుకు అచ్టర్‌ను బాధ్యుడిని చేసింది కోర్టు. ఇందుకు రూ.50 లక్షల భారీ జరిమానా కూడా విధించింది.

టెక్నాలజీ మన జీవితంలో భాగమైపోయినందున, డిజిటల్ కమ్యూనికేషన్‌లలో, ప్రత్యేకించి అగ్రిమెంట్‌ విషయాలను చర్చించేటప్పుడు జాగ్రత్త, స్పష్టతను పాటించడం చాలా అవసరం. లేకపోతే అనవసరమైన చిక్కుల్లో పడి ఇలానే భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తిపరమైన లేదా చట్టపరమైన వ్యవహారాల్లో వాటిని ఉపయోగించే ముందు తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు లేకుండా చూసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news