మనం ఆహారాన్ని ఎలాగైతే మితంగా తీసుకోవాలో.. అలాగే నీటిని కూడా మనకు అవసరం ఉన్నంత మేరకే తాగాలి. ఎక్కువగా నీటిని తాగితే మన ఆరోగ్యానికి సమస్యలు తప్పవని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
నీరు మన శరీరానికి అత్యవసరం.. ఆహారంతోపాటు నిత్యం మనం డాక్టర్లు సూచించిన మేర మన శరీరానికి తగినంత నీటిని అందివ్వాల్సిందే. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లుగా.. మనం ఆహారాన్ని ఎలాగైతే మితంగా తీసుకోవాలో.. అలాగే నీటిని కూడా మనకు అవసరం ఉన్నంత మేరకే తాగాలి. ఎక్కువగా నీటిని తాగితే మన ఆరోగ్యానికి సమస్యలు తప్పవని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. దాహం వేసినప్పుడే నీటిని తాగాలి తప్ప.. అవసరం ఉన్నా, లేకున్నా.. ఎక్కువగా నీటిని తాగరాదని వారు సూచిస్తున్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు కొందరు ఇటీవల చేపట్టిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు తెలిశాయి. వారు కొంత మందిని ఎంపిక చేసి వారిలో సగం మందికి నీటిని బాగా తాగమని చెప్పారు. సగం మందికి దాహం వేసినప్పుడే నీటిని తాగాలని చెప్పారు. అనంతరం వారిని పరీక్షించి చూడగా.. నీటిని అధికంగా తాగిన వ్యక్తుల మెదడులో ఉండే ఫ్రీ ఫ్రంటల్ ప్రాంతాలు చాలా చురుగ్గా ఉన్నాయని నిర్దారించారు. ఈ క్రమంలో అలాంటి వ్యక్తులు ఏదైనా తినాలన్నా, నమలాలన్నా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని కనుక్కున్నారు.
ఈ క్రమంలో సదరు సైంటిస్టులు చెబుతున్నదేమిటంటే.. మనం దాహం వేసినప్పుడే నీటిని తాగాలట. అవసరం లేకున్నా నీటిని ఎక్కువగా తాగకూడదట. ఇక నిత్యం 8 గ్లాసులు అంటారు కానీ.. అందరికీ ఆ సూత్రం వర్తించదని, దాహం అయ్యేవారు మాత్రమే ఆ మేర నీటిని తాగాలని, ఇతరులు కచ్చితంగా 8 గ్లాసుల నీటిని రోజుకు తాగాల్సిన పనిలేదని, తమకు ఇష్టమొచ్చినంత నీటిని తాగవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.
ఇక మనకు నీరు ఎంత కావాలో నిర్ణయించుకునే వ్యవస్థ కూడా మన శరీరంలో ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ వ్యవస్థ మనం నీటిని ఎక్కువగా తాగకుండా చూస్తుందట. అయితే నీటిని మోతాదుకు మించి తాగితే హైపోనెట్రేమియా అనే సమస్య వస్తుందని, దీంతో శరీరంలో ఉండే ద్రవాలు పలుచబడి, సోడియం ప్రమాణాలు పడిపోతాయని, అలాగే శరీరంలో ఉండే కణజాలం నశిస్తుందని, కణాలు వాపునకు లోనవుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు స్పృహ తప్పి పడిపోతారట. అదే పరిస్థితి విషమిస్తే కోమాలోకి కూడా వెళ్లేందుకు అవకాశం ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక జాగ్రత్త.. మీరు కూడా ఇష్టమొచ్చినట్లు నీటిని తాగకండి. దాహం వేసినప్పుడే నీటిని తాగండి. తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు..!