టైటిల్: అర్జున్ సురవరం
నటీనటులు: నిఖిల్, లావణ్య త్రిపాఠి, పోసాని, వెన్నెల కిషోర్, నాగినీడు, సత్య, తరుణ్ అరోరా, ప్రగతి తదితరులు
సమర్పణ: బి.మధు
సినిమాటోగ్రఫీ: సూర్య
ఎడిటింగ్: నవీన్ నూలీ
ఫైట్స్: వెంకట్
మ్యూజిక్: శ్యామ్ సీఎస్
నిర్మాత: రాజ్ కుమార్ ఆకెళ్ల
దర్శకత్వం: టి.సంతోష్
రిలీజ్ డేట్: 29 నవంబర్, 2019
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గత కొద్ది సంవత్సరాల నుంచి మంచి వైవిధ్యం ఉన్న కథలనే తీసుకుని తెరకెక్కిస్తున్నారు. అటు కమర్షియల్ కథలతో పాటు ఇటు కంటెంట్ ఉన్న కథలు కూడా ఎంచుకుంటూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాడు. ఇలా కెరీర్లో వరుసగా ప్రయోగాలు చేసుకుంటూ వెళుతోన్న నిఖిల్ తాజాగా టి సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన “ అర్జున్ సురవరం ” సినిమాలో నటించాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా జర్నలిజం మరియు థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో నిఖిల్ ఎంత వరకు మెప్పించాడో మనలోకం సమీక్షలో చూద్దాం.
కథ:
అర్జున్ లెనిన్ సురవరం (నిఖిల్) ఓ టీవీ ఛానెల్లో రిపోర్టర్‌గా పనిచేస్తుంటాడు. అర్జున్ లక్ష్యం మాత్రం బీబీసీ ఛానల్లో చేయాలని. సెన్సెషనల్ వార్తలు రిపోర్ట్ చేసి ఆ స్థాయికి చేరుకోవాలనుకుంటూ ఉంటాడు. ఓ చిన్న ఛానెల్లో పని చేస్తున్న అర్జున్ అనూహ్యంగా ఓ కేసులో ఇరుక్కుంటాడు. అలాగే మరోపక్క ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేసే ఓ భయంకరమైన మాఫియా కథకు సమాతంరంగా తెరమీద ప్రేక్షకులకు కనిపిస్తుంది. అసలు అర్జున్ తనకి సంబంధం లేని ఆ కేసులో ఎలా ఇరుక్కున్నాడు ? ఈ ఫేక్ సర్టిఫెకెట్ల కేసుకు అర్జున్‌కు ఏం సంబంధం ఉంది..? ఈ నేపథ్యంలో హీరోయిన్ లావణ్య ఎలాంటి పాత్ర పోషించింది? అర్జున్‌ని ఎలా నిరాపరాధిగా బయటవచ్చాడా లేదా..? అన్నది మిగతా కథ. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం ఈ సినిమాను తెరపై చూడాల్సిందే..
విశ్లేషణ :
హ్యాపీడేస్‌తో తన సినిమా కెరీర్‌ను మొదలుపెట్టిన నిఖిల్ ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఈ ప్రయాణంలో మంచిహిట్లు కొట్టాడు..ప్లాపులు మూటగట్టుకున్నాడు. అయితే బీ పాజిటివ్ దృక్పథంతోనే కెరీర్లో దూసుకుపోతున్నాడు. “స్వామిరారా”తో తొలి భారీ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన
కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడాతో మంచి మార్కెట్ ఏర్పడింది. అలా తనకంటూ ఓ మార్క్ ఏర్పరచుకొని అనేక బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాడు.అలా ఇప్పుడు టి సంతోష్ తో చేసిన ప్రయోగం కూడా విజయవంతమైందనే చెప్పాలి.
టి సంతోష్ దర్శకత్వంలోనే తమిళ్ లో తెరకెక్కిన “ కనితన్ ” తెలుగులో నిఖిల్ హీరోగా తీసిన అర్జున్ సురవరం కథనం చూస్తే ఫస్ట్ హాఫ్ లో సినిమా మొదలు కథనం నెమ్మదిగా సాగినా ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించకుండా చూడటంలో దర్శకుడు సఫలమయ్యాడు. కథలో ట్విస్టులు కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. హీరో మరియు విలన్‌కు మధ్య సాగే సీన్స్ కానీ మంచి రసవత్తరంగా సాగుతుంది. ఫస్టాఫ్‌లో మెయిన్ కథనంలోకి వెళ్లేంత వరకు 20 నిమిషాల పాటు బోర్ కొట్టింది. అక్కడ నుంచి కథలో స్పీడ్ అందుకుంది. ఫస్టాప్ వరకు చూసుకున్నట్టయతే సినిమా డీసెంట్ గా కొనసాగింది.మంచి ట్విస్టులు కథనంతో ఇంటర్వెల్ కు 30 నిమిషాల నుంచి బాగుంది.
ఇంటర్వెల్ ట్విస్టులు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మంచి ఎమోషన్స్ సహా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను కూడా సమపాళ్లలో జోడించి బాగా తెరకెక్కించారు. కథ చెప్పడంలో ఎలాంటి తప్పిదాలు చేయకపోవడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనమని చెప్పాలి. గతంలో తీసిన సినిమానే రీమేక్ కావడంతో పెద్దగా సంతోష్ ఇబ్బంది పడలేదు. అదే ఆయనకు అనుకూలంగా మారిందనడంలో సందేహం లేదు. తాను చెప్పాలనుకున్న పాయింట్ ను సందేశాన్ని తెరకెక్కించిన తీరు బాగుంది. ఇక సెకండాఫ్ లో కూడా హీరో మరియు విలన్ మధ్య సాగే ఎపిసోడ్లు ప్రేక్షకులను ఊపిరి బిగపట్టి చూసేలా చేస్తాయి. సెకండాఫ్‌లో ఒక్కో అంశానికి సంబంధించిన ట్విస్టులు రివీల్ అవుతున్నప్పుడు ప్రేక్షకులు బాగా థ్రిల్ ఫీలవుతారు.
నటన విషయానికి వస్తే నిఖిల్ అద్భుతమైన నటనను కనబర్చారు. గత సినిమాల్లో కన్నా ఇందులో మరింత మంచి నటనను ప్రదర్శించాడనే చెప్పాలి. జర్నలిస్ట్ పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చాడు. అలాగే లావణ్య త్రిపాఠి కూడా చాలా బాగుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదరింది. ఇద్దరి మధ్య వచ్చే రొమాన్స్ సన్నివేశాలు.. హావాభావాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాగే నెగిటివ్ రోల్ లో కనిపించిన తరుణ్ అరోరా, కమెడియన్ వెన్నెల కిషోర్ లు వారి పాత్రలకు సరైన న్యాయం చేసారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ “ ఖైదీ ”కి సంగీతం అందించిన సామ్ సీఎస్ అందించిన పాటలు కానీ బ్యాక్‌గ్రౌండ్
స్కోర్ కానీ సినిమాకు డీసెంట్ బూస్ట్ ను ఇస్తాయి. అలాగే సూర్య అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా పెద్ద ప్లస్ అనే చెప్పాలి.
ప్లస్‌లు….
ప్రధాన కథతో పాటు.. సినిమాలో వచ్చే ట్విస్టులు… నేపథ్య సంగీతం… నిఖిల్ నటన
మైనస్‌లు…
ఇక అసలు కథలోకి వెళ్లేముందు తొలి 20 నిమిషాలు అంతగా ఆకట్టుకోలేదు. ఇక కథ అంతా సీరియస్ మోడ్‌లో సాగడంతో కామెడీ ఆశించే వాళ్లకు ఎంత వరకు కనెక్ట్ అవుతుందో ? చూడాలి. ఇక కాసులు కురిపించేలా కమర్షియల్ హంగులు లేకపోవడం కూడా చిన్న మైనస్.
ఫైనల్‌గా…
ఇక ఓవరాల్‌గా ప్రారంభంలో నెమ్మదిగా ఉన్నా తర్వాత దర్శకుడు సంతోష్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. కోలీవుడ్ కథను తెలుగు నేటివిటికి అనుగుణంగా చక్కగా మలిచాడు. ప్రేక్షకులు మంచి థ్రిల్స్ ఎంజాయ్ చేస్తారు. కమర్షియల్ హంగులు తక్కువైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా ఎలాంటి పెర్పామెన్స్ ఇస్తుందో ? చూడాలి.
అర్జున్ సురవరం రేటింగ్: 2.75 / 5