కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ అయిన 2,200 మంది పేషెంట్లు గత 2 వారాలుగా కనిపించడం లేదని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. వారు హోం ఐసొలేషన్‌లో ఉండాల్సిన వారని, వారు తమ ఫోన్ నంబర్లు, చిరునామాలను కూడా తప్పుగా ఇచ్చారని తెలిపారు. ఆయా పేషెంట్లకు పాజిటివ్ అని నిర్దారణ అయిన తరువాత వారికి హోం ఐసొలేషన్ కిట్లను అందించేందుకు యత్నిస్తే.. వారి ఫోన్ నంబర్లు కలవడం లేదని తెలిపారు.
మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు కూడా వారిని ట్రేస్ చేయడంలో విఫలం చెందారు. ఆయా పేషెంట్లు తప్పుడు ఫోన్ నంబర్లు, చిరునామాలు ఇవ్వడం వల్లే వారిని గుర్తించడం కష్టంగా మారిందని అంటున్నారు. కొందరు ఇచ్చిన చిరునామాల్లో ఉండడం లేదని, వేరే అడ్రస్‌కు మారిపోయి ఉంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ హెల్త్ అడిషనల్ కమిషనర్ బాధావత్ సంతోష్ మాట్లాడుతూ.. ఐసొలేషన్ కిట్లను అందజేసేందుకు సిబ్బంది ఫోన్లు చేస్తుంటే ఆ నంబర్లు కలవడం లేదని తెలిపారు.
పాజిటివ్ వచ్చి హోం ఐసొలేషన్‌లో ఉండాల్సిన వారు కచ్చితంగా ముందుకు వచ్చి కిట్లను తీసుకుని తమకు సహకరించాలని కోరుతున్నారు. కరోనా వచ్చిన వారు బహిరంగ ప్రదేశాల్లో తిరిగి వైరస్ మరింత ఎక్కువ మందికి వ్యాపించే ప్రమాదం ఉంటుందని.. కనుక పేషెంట్లు పాజిటివ్‌గా నిర్దారణ అయితే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కిట్లను తీసుకోవాలని సూచించారు. ఇతరుల ప్రాణాలతో వారు చెలగాటం ఆడవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.