రానున్న రోజుల్లో బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా ఎదురే లేకుండా పోతుందా.. జాతీయ స్థాయిలో కమలానికి ప్రత్యామ్నాయం ఉంటుందా?. కేంద్రంలో మోడీని ఎదుర్కొని నిలబడి.. కలబడి పోరాడే పార్టీ, నాయకుడు ఎవరైనా ఉన్నారా..ప్రజాస్వామ్యం విజయవంతానికి బలమైన ప్రభుత్వంతో పాటు బలమైన ప్రతిపక్షం కూడా అవసరం.
ప్రస్తుతం పార్లమెంట్‌లో ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకీ బలహీన పడుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మరీ అధ్వాన్నం. అంతంతమాత్రం బలం ఉన్న పార్టీలు కూడా తమకు కేటాయించిన సీట్లలో 60 శాతం గెలుచుకున్నాయి. కాంగ్రెస్ మాత్రం 70 సీట్లలో పోటీ చేసి 20 సీట్లకే పరిమితం అయింది. కాంగ్రెస్ ప్రదర్శన కాస్త మెరుగ్గా ఉండి ఉంటే.. బీహార్‌లో మహా కూటమి అధికారంలోకి రావడంతో పాటు జాతీయ స్థాయిలో హస్తం పార్టీలో ఉత్సాహం పెరిగి ఉండేది.
కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంలను నిందించడం, ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేయడం అలవాటుగా మారింది. మహారాష్ట్రలో ఎన్సీపీ, బీహార్‌లో ఆర్జేడీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న పార్టీలే. ఆ రెండు పార్టీలు బరిలో దిగి వీర లెవల్లో పోరాడితే.. కాంగ్రెస్ మాత్రం అక్కడా ఇక్కడా చతికిల పడింది. తాను మునగడంతో పాటు తన భాగస్వామ్య పార్టీలను కూడా ముంచేసింది.
కాంగ్రెస్ బలహీనపడటం, ప్రాంతీయ పార్టీల హవా తగ్గుతూ ఉండటంతో బీజేపీ బలం ఇంతింతై అన్నట్లు పెరుగుతోంది. నరేంద్రమోడీ, అమిత్‌షాకు వ్యతిరేకంగా గొంతెత్తడానికి కూడా వారి ప్రత్యర్థులు భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రాజ్యసభలోనూ బీజేపీ బలం మరింత పెరుగుతుంది. లోక్‌సభ, రాజ్యసభలో బీజేపీ బలంగా మారితే మోడీ సర్కారు తీసుకునే నిర్ణయాలకు ఎదురు లేనట్లే.
పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో బీజేపీకి ఎదురు నిలబడే బలమైన పార్టీ కానీ, కూటమి కానీ సమీప దూరంలో కనిపించడం లేదు. లౌకిక వాదం కావచ్చు, మరి కొన్ని అంశాలు కావచ్చు… బీజేపీని వ్యతిరేకించే పార్టీలను ఒకే గూటికి తీసుకు రావడంలో కాంగ్రెస్ ఒక వేదికలా పని చేస్తోంది. కాంగ్రెస్ బలహీన పడే కొద్దీ… జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తి ఎవరు అనే ప్రశ్నకు సమాధానం కనిపించడం లేదు. ప్రాంతీయ పార్టీల్లో నాయకత్వ లోపం, సమన్వయం లేకపోవడం లాంటివి.. మరో ఇబ్బందికర అంశం. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడులో బీజేపీ సత్తా చాటితే.. కమలానికి ఎదురు లేనట్లే.