భూమికి ముప్పు తప్పింది. అక్టోబర్ 24 ఆదివారం రోజున భూమికి దగ్గరగా గ్రహశకలం ప్రయాణించింది. కేవలం భూమికి 3 వేల కిలోమీటర్ల దూరం నుంచే గ్రహశకలం వెళ్లినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆస్టరాయిడ్ 2021 యూఏ1 అనే గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చి వెళ్లింది. కేవలం 2 మీటర్ల పరిమాణంలో గ్రహశకలం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక వేళ గ్రహశకలం భూమిపై పడే అవకాశం ఉంటే.. అంటార్కిటికా ప్రాంతంలో పడేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పరిమాణం చిన్నదైనప్పటికీ భూమిని ఢీకొంటే దాని ప్రభావం ఎక్కువగానే ఉండేదని సెంటిస్టులు పేర్కొన్నారు.
భూమి వైపుగా దూసుకువస్తోన్న పలు గ్రహశకలాల గుర్తింపు, వాటి గమనాలపై రోదసీ శాస్త్రవేత్తలు ఎప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు వాటి గమనాలను ట్రాక్ చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం భూమికి సమీపంలోకి వచ్చిన 2021 యూఏ 1 గ్రహశకలం సూర్యుడి వైపు నుంచి రావడంతో, విపరీతమైన కాంతి కారణంగా శాస్త్రవేత్తలు గుర్తించలేకపోయినట్లు తెలిసింది.
నిజానికి భూమి వైపు గ్రహశకలాలు, తోకచుక్కలు రావడం చాలా అరుదు. అంగారకుడు, గురుగ్రహాల మధ్య ఉన్న ఆస్టరాయిడ్ బెల్ట్ లో కొన్ని కోట్ల కోలది గ్రహశకలాలు ఉన్నాయి. అయితే గురు గ్రహ గురుత్వాకర్షణ శక్తి వలన వీటి కక్ష్య అక్కడే స్థిరంగా ఉంటుంది. కానీ కొన్ని మాత్రం వాటి కక్ష్య నుంచి విడిపోయి ఇలా భూమి వైపు వస్తుంటాయి. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం భూమిని పెద్ద గ్రహశకలం ఢీ కొనడంతో డైనోసార్లు అంతమయ్యాయి.