టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తాజాగా పూరి మ్యూజింగ్స్’ పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ‘రియాక్షన్స్’పై మాట్లాడారు.. ఈ సంద్భంగా ‘ఇడియట్’ మూవీ షూటింగ్ సమయంలో హీరోయిన్ రక్షితకు గట్టి వార్నింగ్ ఇచ్చానని.. అయితే ఆ తర్వాత ఆమె ఇచ్చిన రియాక్షన్ చూసి షాక్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చారు..
”జీవితంలో చాలా జరుగుతాయి.. జరుగుతుంటాయి. వాటి మీద మనకు ఎలాంటి కంట్రోల్ ఉండదు. మన చేతిలో ఉండేది ఒక్కటే, రియాక్షన్స్ ఇవ్వడమే. ఏం జరిగితే ఎలా రియాక్ట్ అవుతున్నామనేది చాలా ముఖ్యం. ఎంత కష్టమొచ్చినా, ఏ సమస్య వచ్చినా మన రియాక్షన్ ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండాలి. అరిచి గోల చేసేయడం, తల గోడకేసి కొట్టుకోవడం వాటి వల్ల అస్సలు ఉపయోగం లేదు. నీ ఎమోషన్స్ వల్ల, తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటావు. సమస్య ఎప్పుడూ సమస్య కాదు. నీ ప్రతిస్పందన వల్ల వచ్చే సమస్యే అసలు సమస్య. మనం మనుషులకు ఎలా రియాక్ట్ అవుతున్నాం? సంఘటనలకు ఎలా రియాక్ట్ అవుతున్నాం? లేదా ఎవరైనా ప్రశ్నిస్తే, దానికి ఏం సమాధానం ఇస్తున్నామనేది చాలా ముఖ్యం. బ్యాలెన్డ్స్‌గా ఆలోచించడం, ఆచితూచి మాట్లాడటం చాలా అవసరం. ఏ మాట్లాడినా, మన భావోద్వేగాలను నియంత్రణలో పెట్టుకొని మాట్లాడాలి.. అలాగే మీరు ఎప్పుడైతే విపరీతమైన కోపంలో ఉంటారో అప్పుడు అస్సలు సమాధానం చెప్పొద్దు. చాలా నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోండి. చాలా సార్లు ఏమీ చేయకపోవడం, భావాలను వ్యక్తపరచకపోవడం ఇంకా మంచిది. అవతల మనిషి కోపంలో ఉన్నప్పుడు నవ్వుతూ సమాధానం ఇవ్వండి. వాడికి ఏం చేయాలో తెలియదు. ‘ఇడియట్’ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక సీను రక్షిత ఏడ్వాల్సి ఉంది కానీ ఆమెకి ఎక్స్ప్రెషన్ రావడం లేదు పగలబడి నవ్వుతుంది నాకు విపరీతమైన కోపం వచ్చింది.. సెట్‌లో అందరూ వింటుండగా, ‘రక్షిత నువ్వు ఫోకస్ చేయడం లేదు. తర్వాతి సినిమాలో నీకు క్యారెక్టర్ రాయను.. అని చాలా గట్టిగా చెప్పా. తను వెంటనే ‘రాయి.. రాయకపోతే చంపేస్తాను. నీ తర్వాతి పది సినిమాలు నేనే చేస్తా. ఇప్పుడు నీకు ఏం కావాలో సరిగా చెప్పి చావు’ అని అన్నది. అంతే, ఆ అమ్మాయి స్పందనకు సెట్‌లో అందరూ క్లాప్స్‌కొట్టారు. ఆ మాటలకు నాకు కూడా నవ్వు ఆగలేదు. నేను ఊహించని సమాధానం అది. ఆ అమ్మాయి మీద కోపం మొత్తం పోయింది.. ” అని చెప్పుకొచ్చారు పూరి జగన్నాథ్..
అలాగే ”నేను అన్న మాటలకు ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ సెట్‌లో నుంచి బయటకు వెళ్లిపోవచ్చు. లేదా అలిగి రెండో రోజూ షూటింగ్‌కు రాకపోవచ్చు. కానీ, తను అలా చేయలేదు. మన రియాక్షన్స్ వల్ల లైఫ్‌లో చాలా విసుగు, చికాకులను తగ్గించుకోవచ్చు. ఇవికాకుండా సోషల్‌మీడియాలో ఎవరెవో పోస్టులు పెడతారు. ప్రతి దానికీ మనం స్పందించాల్సిన అవసరం లేదు. అలాగే న్యూస్… ఎక్కడో ఏదో జరిగితే మనం వైల్డ్‌గా రియాక్ట్ అయి, వాదించడం అవసరమా? మనం పనికి వచ్చే వాటికే స్పందిద్దాం. నవ్వుతూ చెప్పే సమాధానం, లేకపోతే, ఏ సమాధానం చెప్పకుండా మీరు నవ్వే చిన్న చిరునవ్వు చాలా సమస్యలను పరిష్కరిస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు..