బీజేపీ శాసనపక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఉరితీసిన తప్పులేదని కేసీఆర్ ప్రకటించినా, రేవంత్ చర్యలు తీసుకోకపోవడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ఇద్దరి మధ్య అవగాహన స్పష్టంగా కనిపిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ మద్దతు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కొనసాగాలని చెప్పడం ద్వారానే బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసిపోయినట్లు స్పష్టం అవుతోందని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిన్న జరిగిన రజతోత్సవ సభపై స్పందించిన ఆయన, కేసీఆర్ సభ కొండంత హైప్ తీసుకున్నా, తీరా దిక్కుమాలిన పాటలా ముగిసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణను విధ్వంసం చేసిన ప్రధాన కారణం కేసీరే అని ఆయన మండిపడ్డారు.
రాజధాని హైదరాబాద్‌లో జరిగిన సభ కోసం రూ.150 కోట్లు ఖర్చు పెట్టినా కనీసం లక్ష మందిని కూడా సమీకరించలేకపోయారని ఆరోపించారు. సభ అట్టర్ ఫ్లాప్ అయిందని పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణకు ఎన్నో వనరులు ఇచ్చినా, 11 రూపాయలు కూడా ఇవ్వలేదంటూ కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. మావోయిస్టులతో చర్చలు జరపకుండా నేరుగా ఎదురు దాడులకు పాల్పడినది కేసీఆర్ ప్రభుత్వమేనని, గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన తరువాత వారిపై దాడులు చేసిన ఘనత కూడా ఆ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. అధికారాన్ని కోల్పోయిన కేసీఆర్ మతిస్థిమితం కోల్పోయారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ మౌనం దేనికని ప్రశ్నించిన మహేశ్వర్ రెడ్డి, అది ఎత్తిపోతల పథకం కాదు.. తిప్పిపోతల పథకమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మోడల్ అంటే దుర్మార్గం, కుటుంబ పాలన, విధ్వంసం, అరాచకమేనని ఫైర్ అయ్యారు.