ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరు కేటుగాళ్లు మాత్రం ఎప్పుడూ ఏదో ఒక కొత్త పద్ధతిలో ప్రజల డబ్బును దోచేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వృద్ధులను లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు రెచ్చిపోతున్నారు. ఏటీఎం సెంటర్లో వారికి సహాయం చేసే వంకతో వారిని మోసం చేస్తూ రూ.వేలల్లో దోపిడీ చేస్తున్నారు. కోల్కతా నగరంలో ఈ తరహా మోసాలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి.
కోల్కతా నగరంలో ఏటీఎం సెంటర్లలో వృద్ధులను మోసం చేసి డబ్బులు కాజేస్తున్న అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు దుండగులు జెంటిల్మెన్లలా సూటు, బూటు ధరించి ఏటీఎంలకు వెళ్తారు. అక్కడికి వచ్చే వృద్ధులను పసిగట్టి వారికి సహాయం చేసే వంకతో ముందుగా వారు అడిగిన మేర డబ్బులను విత్ డ్రా చేసి వారికి ఇస్తారు. అయితే ఆ సమయంలో వృద్ధుల ఏటీఎం కార్డులను మార్చి తమ వద్ద ఉండే సరిగ్గా అలాంటి ఫేక్ కార్డులను వృద్ధులకు ఇస్తారు. దీంతో వృద్ధులకు తమ కార్డులు మారాయయన్న విషయం తెలియదు. ఇక డబ్బులు విత్ డ్రా చేసే సమయంలో ఎలాగూ పిన్ నంబర్ కూడా తెలుసుకుంటారు. కనుక వృద్ధులు ఏటీఎం నుంచి వెళ్లిపోగానే వారి నుంచి తస్కరించిన కార్డులతో ఎంచక్కా డబ్బులు విత్ డ్రా చేస్తారు. ఇదీ.. ప్రస్తుతం అనేక చోట్ల జరుగుతోంది.
కోల్కతాలో పైన తెలిపిన లాంటి సంఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. అందువల్ల వృద్ధులు ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లోని కుటుంబ సభ్యులు లేదా తెలిసిన వారి సహాయంతో ఏటీఎంలకు వెళ్లి డబ్బులు విత్ డ్రా చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కోల్కతాలో ఒక చోట ఓ వృద్ధుడు ఏకంగా రూ.96వేలను ఇలా పోగొట్టుకున్నాడు. కనుక వృద్ధులు ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి.