ఉమ్మడి మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. మంత్రాలు చేస్తున్నారనే నెపంతో సహ కుటుంబ సభ్యులే ఓ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. తమ ఇంట్లోని కుటుంబ పెద్ద చనిపోవడంతో భార్య, బిడ్డ, అల్లుడితో కలిసి పెద్దలకు శనివారం రాత్రి పూజ నిర్వహించారు. ఈ క్రమంలోనే మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో తోటి కుటుంబీకులు వారిని చితక్కొట్టారు.
ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలో వెలుగుచూసింది. ఎస్ఐ శివానందం కథనం ప్రకారం.. కిష్టాపూర్‌కు చెందిన పోచయ్య ఇటీవలే మృతి చెందగా, తన భార్య కమలమ్మ, కోడలు నవనీత, కొడుకు స్వామి, బిడ్డలు, అల్లుళ్లతో కలిసి పెద్దలకు పూజ చేశారు. అయితే, మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో పక్కన ఉండే తోటి కుటుంబీకులు వారితో గొడవకు దిగడంతో పాటు ముగ్గురిపై దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.