ఆస్ట్రేలియా ప్రభుత్వం క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. అక్కడ 40వేలకు మించి కెపాసిటీ ఉన్న స్టేడియాల్లో 10వేల మంది ప్రేక్షకులతో మ్యాచ్‌లను నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ అనుమతులు జారీ చేశారు. కాగా భారత్ ఆస్ట్రేలియాలో డిసెంబర్ 3వ తేదీ నుంచి 4 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. అక్కడి గబ్బా, అడిలైడ్ ఓవల్, ఎంసీజీ, ఎస్‌సీజీ స్టేడియాల్లో భారత్, ఆసీస్‌లు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి. దీంతో భారత క్రికెట్ అభిమానులకు కూడా ఇది శుభవార్తేనని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
అయితే అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొంత వరకు ఐసీసీకి ఊరట కలిగించేదే. ఖాళీ స్టేడియాలతో మ్యాచ్‌లను నిర్వహించే బదులు కొద్ది వరకు అయినా సరే.. ప్రేక్షకులు ఉంటే.. మ్యాచ్‌లకు ఆ ఊపు, ఉత్సాహం వస్తాయి. అందువల్ల ఐసీసీకి కూడా ఈ విషయం తృప్తిని కలిగించేదే. అయితే టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై ఐసీసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వచ్చే నెల వరకు తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై స్పష్టత రావాలంటే జూలై వరకు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది.
అయినప్పటికీ న్యూజిలాండ్‌లో కరోనా పూర్తిగా తగ్గడం, ఇటు ఆస్ట్రేలియాలోనూ కేసుల సంఖ్య తగ్గుతుండడం.. మరో వైపు ఆ దేశ ప్రభుత్వం స్టేడియాలలో 10వేల మంది ప్రేక్షకులతో మ్యాచ్‌లను నిర్వహించుకునేందుకు అనుమతులు ఇవ్వడం.. తదితర పరిణామాలను చూస్తుంటే.. ఐసీసీ కచ్చితంగా టీ20 వరల్డ్ కప్‌ను నిర్వహించి తీరుతుందనే వార్తలు వస్తున్నాయి. ఇక జూలై వరకు ఆగితేనే కానీ.. ఈ విషయంపై స్పష్టత రాదు. మరి ఐసీసీ ఏం చేస్తుందో చూడాలి.