కరోనా లాక్ డౌన్ కారణంగా అలస్యమైన ఇంటర్మీడియట్ ఫలితాలు ఎట్టకేలకు ఇవాళ విడుదలయ్యాయి. కొద్దిసేపటి క్రితం ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ విడుదల చేశారు. ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానం రద్దు అయినందున ఫస్ట్ ఇయర్ ఫలితాలను సబ్జెక్టుల వారీగా మార్కుల రూపంలో ప్రకటించారు. అయితే సెకండ్ ఇయర్ విద్యార్ధులకు మాత్రం గ్రేడ్లను ప్రకటించారు. అసలు 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశంలో ఇంత వరకు ఏ రాష్ట్రం కూడా ఇంటర్ ఫలితాలను ప్రకటించలేదు. ఏపీనే తొలి రాష్ట్రం. మొత్తంగా చూసుకుంటే ఈ సంవత్సరం 5,07,228 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాశారు. వారిలో 3,00,560 మంది ఉత్తీర్ణులయ్యారని, పాస్ శాతం 59 అని మంత్రి వివరించారు. అలాగే 4,88,795 మంది రెండో సంవత్సరం విద్యార్థులు పరీక్షలను రాశారు. వారిలో పాసైంది 2,76,389 మంది అని, పాస్ శాతం 63 అని తెలిపారు. ఇకపోతే ఫలితాల అనంతరం కాలేజీలు ఎలాంటి ప్రకటనలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో జారీ చేయకూడదని బోర్డు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. మెమోలను జూన్ 15 నుంచి ఏపీ ఇంటర్ బోర్డు అఫీషియల్ వెబ్‌సైట్ https://bie.ap.gov.in/ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.