ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం అమలు అయినా నాటి నుంచి ఆటో డ్రైవర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవాళ ఆటో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందారపు వెంకటేశం డ్రైవర్లకు జీవన భృతి నెలకు పది వేలు ఇచ్చి వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
గురువారం జిల్లా కేంద్రంలో భువనగిరి టు మోత్కూరు రూట్ టాటా ఏస్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా దిమ్మెను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు ప్రతి నెల రూ.10 వేలు ఇచ్చేంత వరకు త్వరలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు.జిల్లా కేంద్రంలో ఆటోలకు పార్కింగ్ స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈనెల ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త గ్రామీణ సమ్మె బంద్‌లో ప్రతి ఒక ఆటో కార్మికుడు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ లో 15 లక్షల మంది ఆటో మీద ఆధారపడి జీవిస్తున్నారని, పరోక్షంగా 40 లక్షల మంది వారి కుటుంబ సభ్యులు వారిపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.