ఈ భూమండలంలో పేరుగాంచిన భారత దేశంలో పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాలతో పాటు కొన్ని విచిత్రమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆలయాల వెనక ఉన్న రహస్యాలు కనుగొనడం చాలా కష్టం. మన దేశంలో ఒకే ఒక బ్రహ్మ దేవాలయం ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌కు పదకొండు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న ఒక సరస్సు. ఆ సరస్సు పేరైన పుష్కర్ క్రమంగా ఆప్రాంత మంతటికి స్థిరపడిదింది. ఇక్కడే బ్రహ్మదేవునికి ఒక ఆలయం ఉంది.
ఇక్కడ బ్రహ్మకు నాలుగు తలలు ఉంటాయి. అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు నిర్మించారన్న దానికి సరైన ఆధారాలు లేవు. అయితే ఈ ఆలయంలోకి బ్రహ్మచారులు వెళ్లరు. అలా వెళ్లితే వారికి పెళ్లి కాదని చెబుతారు. అందుకే ఈ ఆలయంలోకి భగవంతుడిని దర్శించుకునేందుకు బ్రహ్మచారులు వెళ్లరు. అలాగే ఈ ఆలయ గర్భ గుడిలోకి వివాహితులైన పరుషులకు కూడా ప్రవేశం లేదు. ఒకవేళ ప్రవేశిస్తే.. వివాహ జీవితంలో కష్టాలు తప్పవని ప్రజలు నమ్ముతారు.
భారతదేశంలో ఉన్నతీర్థాలలో అతి పవిత్రమైనది ఈ పుష్కర్ తీర్థమే. అందుకే దీన్ని తీర్థ రాజమంటారు. దీన్ని దర్శించక పోతే తీర్థ క్షేత్రాల యాత్ర పూర్తి కానట్టే నని భావిస్తారు హిందూ మతస్తులు. పుష్కర్ ప్రత్యేక ఆకర్షణ త్రిమూర్తులలో ఒకడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఆలయం. బ్రహ్మదేవుడు ప్రధాన దైవంగా పూజింపబడే ఏకైక ఆలయం ఇది. ఆలయంలో బ్రహ్మదేవుడి సంపూర్ణ ఆకారం ప్రతిష్ఠించబడింది.