తమ పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటే.. మంచి అవకాశాలు ఉంటాయని, వారి భవిష్యత్తు బాగుంటుందని వారి స్థోమత సరిపోకపోయినా అప్పో సొప్పో చేసి ప్రైవేటూ స్కూల్స్ కి పంపిస్తుంటారు తల్లితండ్రులు! వీరి బలహీనతలను క్యాష్ చేసుకునే విషయంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఏమాత్రం వెనక్కి తగ్గవు! పిల్లోడు చదివేది ఎల్కేజీనా యూకేజీనా అన్నది కాదు ముఖ్యం.. ఫీజు కనీసం లక్ష దాటిందా లేదా అన్నది పాయింట్ గా చెలరేగిపోతున్నాయి! ఈ విషయంలో వారికి హైకోర్టు గుడ్ న్యూస్ తాజాగా చెప్పింది!
అవును… ఏపీలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులపై “ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా”నే ప్రభుత్వం ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ప్రతి ప్రైవేట్ పాఠశాలను సందర్శించి, అక్కడ ఉన్న వసతులు, విద్యా నాణ్యత ఆధారంగానే ఫీజులు నిర్ణయించాలని భావించింది. ప్రభుత్వ సిలబస్ ని కచ్చితంగా పాటించాలని, ఏ స్కూల్ కి ఆ స్కూల్ తమకి నచ్చిన సిలబస్ చెప్పుకుంటామంటే కుదరదని తేల్చి చెప్పింది.
అయితే… ఈ విషయంపై స్పందించిన ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు… కమిషన్ పేరుతో ప్రభుత్వం తమపై ఆధిపత్యం చెలాయించడం కుదరదని.. తమ ఫీజులు తామే నిర్ణయించుకుంటామని.. ఫీజులు తగ్గిస్తే విద్యా ప్రమాణాలు పడిపోతాయని కోర్టుని ఆశ్రయించాయి! ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు.. ఫీజుల నియంత్రణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యకలాపాలపై తాత్కాలికంగా స్టే విధించింది. దీంతో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు పండగ చేసుకుంటున్నాయి!
అయితే ఈ స్టే వల్ల ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కానీ… తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ కి పంపుతున్న తల్లితండ్రులకు మాత్రం కచ్చితంగా బ్యాడ్ న్యూస్ అనేది బలంగా వినిపిస్తున్న మాట!!