కరోనా వైరస్‌కు గాను ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. భారత్‌లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ రేసులో ముందుంది. ఆ కంపెనీ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు భారత్‌లో ఫేజ్ 2, 3 ట్రయల్స్‌ను నిర్వహిస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్ ఈ ఏడాది చివరి వరకు అందుబాటులోకి వస్తుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే అందుబాటులోకి రాదని సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా స్పష్టం చేశారు.
కోవిడ్‌కు పూర్తి స్థాయి వ్యాక్సిన్ వచ్చేందుకు 2024 వరకు సమయం పడుతుందని, అందువల్ల ఈ ఏడాది చివరి వరకు వ్యాక్సిన్ వస్తుందని ఆశలు పెట్టుకోకూడదని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ వివరాలను వెల్లడించారు. కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే అందుబాటులోకి రాదని, ఫార్మా కంపెనీలు ఇంత తక్కువ వ్యవధిలో పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయలేవని, పరిమితి సంఖ్యలో డోసులను మాత్రమే కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపారు.
ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాక్సిన్ కావాలంటే సుమారుగా 1500 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని అన్నారు. అందువల్ల ఆ ప్రక్రియ పూర్తయ్యేందుకు 3, 4 ఏళ్లు పడుతుందని, కనుక కోవిడ్ వ్యాక్సిన్ జనాలకు అందరికీ ఇప్పుడే అందుబాటులోకి రాదని అన్నారు. కాగా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు గాను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఫేజ్ 2, 3 ట్రయల్స్ ను ఇటీవలే మళ్లీ ప్రారంభించింది.